పాకిస్థాన్ దేశం నుండి భారత్ కు ఎలాంటి వస్తువులను దిగుమతి చేయడానికి అనుమతి లేదు. ఈ మేరకు ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం కఠినమైన అదేశాలు జారీ చేసింది. అయిన హైదరాబాద్ లో మాత్రం పాకిస్థాన్ లో తయారైన వస్తువు దొరకడం మాత్రం ఆగడం లేదు. పాకిస్థాన్లో తయారైన కాస్మెటిక్స్ హైదరాబాద్కు చేరుతూనే ఉన్నాయి. తాజాగా అధికారులు నిర్వహించిన దర్యాప్తులో దీని వెనుక విస్తృతమైన సరఫరా వ్యవస్థ ఉన్నట్లు అర్ధం అవుతోంది. ఈ ఉత్పత్తులు ముంబైలోని మార్కెట్కు నుండి ఇక్కడికి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చర్మాన్ని తెల్ల గా మార్చుతామని ప్రచారం చేసే కొన్ని లోషన్లు, సోప్ బార్స్ ఇక్కడి మార్కెట్ లో విరివిగా దొరుకుతున్నాయి. ఈ ఉత్పత్తులపై ప్రజారోగ్య పరమైన ఆందోళనలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) గత నెలలో పాకిస్థాన్లో తయారైన రెండు క్రీముల్లో ప్రమాదకర స్థాయిలో భారీ లోహాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో వినియోగదారులను హెచ్చరించింది.
సెప్టెంబర్ 8న CDSCO జారీ చేసిన హెచ్చరికలో పేర్కొన్న ఉత్పత్తుల్లో ‘Goree Beauty Cream’, ‘Chandni Whitening Cream’ కూడా ఉన్నాయి. హైదరాబాద్లోని మూడు దుకాణాలపై నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉత్పత్తులు ఇప్పుడు బయటపడ్డాయి. హైదరాబాద్ లో స్వాధీనం చేసుకున్న కాస్మెటిక్ను ముంబైలోని ఓ మార్కెట్ నుంచి సేకరించినట్లు భావిస్తున్నామని దర్యాప్తులో పాల్గొన్న ఒక అధికారి తెలిపారు. ఈ ఉత్పత్తులు భారత్లోకి ఎలా ప్రవేశించాయి, దిగుమతులపై ఆంక్షలు ఉన్నప్పటికీ హోల్సేల్, రీటైల్ మార్కెట్లకు ఎలా చేరుకున్నాయి అనే విషయాలను తెలుసుకునేందుకు అధికారులు సరఫరా వ్యవస్థలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
2025 మే 2 నుంచి పాకిస్థాన్లో ఉత్పత్తి అయిన లేదా అక్కడి నుంచి ఎగుమతి చేయబడిన అన్ని వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులు లేదా రవాణాపై భారత్ నిషేధం విధించింది. జాతీయ భద్రత, ప్రజా విధానాలను కారణంగా చూపుతూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్ ద్వారా ఈ ఆంక్షలను అమలు చేసింది. మరో దేశం ద్వారా పాకిస్థాన్ ఉత్పత్తులను భారత్కు తీసుకువచ్చినా ఆ దిగుమతులు చట్టబద్ధం కావని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, భారత్లోకి దిగుమతి చేసే కాస్మెటిక్స్ పై Cosmetics-rules , 2020 నిబంధనలు కూడా వర్తిస్తాయి. దిగుమతికి ముందు ఉత్పత్తులు Central Licensing Authority వద్ద నమోదు కావడంతో పాటు, నిర్దేశిత నాణ్యత, భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.
హైదరాబాద్ దర్యాప్తులో మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. యుకే నుంచి వచ్చినట్లు పేర్కొంటున్న ఒక అయింట్మేంట్ ను కాస్మెటిక్ ఉత్పత్తులతో కలిపి, చర్మం తెల్లబడేందుకు ఉపయోగించే ఉత్పత్తిగా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఉత్పత్తుల నమూనాలను ఫొరెన్సిక్ పరీక్షలకు పంపించారు. వాటి కూర్పును నిర్ధారించడంతో పాటు, వాటిలో ఉన్న పదార్థాలను గుర్తించేందుకు ప్రయోగశాల నివేదికల కోసం దర్యాప్తు అధికారులు ఎదురుచూస్తున్నారు.