AI Generated Image
జాతీయ వార్తలు

ఐటీ రంగంలో మళ్లీ హైరింగ్‌ జోష్‌.. 1.23 లక్షలకు చేరిన ఓపెనింగ్స్‌!

Phaneendra

భారత్‌ ఐటీ రంగానికి మళ్లీ హైరింగ్‌ కళ వచ్చేసింది. గత కొంతకాలంగా ఏఐ ప్రభావం, నియామకాల్లో కోతలు, టెక్‌ ఉద్యోగ మార్కెట్‌లో మందగమనం వంటి ప్రతికూల పరిణామాలతో కనిపించిన ఐటీ రంగంలో ఇప్పుడు కొత్త నియామకాలపై ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. కంపెనీలు మళ్లీ టెక్‌ నిపుణుల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. స్పెషలిస్ట్‌ టాలెంట్‌ సొల్యూషన్స్‌, స్టాఫింగ్‌ సంస్థ Xpheno (ఎక్స్‌ఫెనో) తాజాగా విడుదల చేసిన Active Tech Jobs Outlook నివేదిక ఈ ట్రెండ్‌కు బలం చేకూరుస్తోంది.

18 నెలల గరిష్టానికి హైరింగ్

Xpheno (ఎక్స్‌ఫెనో) నివేదిక ప్రకారం యాక్టివ్‌ టెక్‌ ఉద్యోగ అవకాశాలు అక్టోబర్‌లో 1.23 లక్షలకు చేరాయి. ఇది గత 18 నెలల్లోనే అత్యధిక స్థాయి (గరిష్టం). సెప్టెంబర్‌తో పోలిస్తే 5 శాతం, గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే 17 శాతం పెరుగుదల నమోదైంది. టెక్‌ ఉద్యోగ మార్కెట్‌ రికవరీకి ప్రధానంగా ఐటీ సర్వీసెస్‌ రంగం ఊతమిస్తోంది. ఈ విభాగంలో అక్టోబర్‌లో 66 వేల యాక్టివ్‌ ఓపెనింగ్స్‌ నమోదయ్యాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే 16 శాతం, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఏకంగా 57 శాతం పెరిగాయి. AI Engineering, Analyst, Technical Lead వంటి పాత్రల్లో డిమాండ్‌ పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణాల్లో ఒకటిగా Xpheno పేర్కొంది.  

AIతో ఉద్యోగాలు పోతాయా? కొత్త ఉద్యోగాలు వస్తున్నాయా?

కృత్రిమ మేధతో కొన్ని సంప్రదాయ ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతున్న వేళ.. మరోవైపు AI ఆధారిత నైపుణ్యాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా AI Engineering, Data/Analytics, Technical Leadership వంటి విభాగాల్లో నియామకాలు ఊపందుకుంటున్నాయి. ఇదే సమయంలో Core Tech & Engineering విభాగంలో ఏకంగా 61 వేల యాక్టివ్‌ ఓపెనింగ్స్‌ నమోదయ్యాయి. మొత్తం 1.23 లక్షల టెక్‌ ఉద్యోగ డిమాండ్‌లో దాదాపు సగం ఈ విభాగానిదే. అంటే AI కారణంగా టెక్‌ ఉద్యోగాల స్వరూపం మారుతున్నప్పటికీ.. టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ నైపుణ్యాలకు డిమాండ్‌ మాత్రం కొనసాగుతోంది.

అనుభవం ఉన్నవారికే ..

ఐటీ రంగంలో నియామకాల జోష్‌ తిరిగి వచ్చినప్పటికీ.. ఫ్రెషర్ల కంటే అనుభవం ఉన్న అభ్యర్థులకే కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న విషయం గమనించాలి. అక్టోబర్‌లో నమోదైన 1.23 లక్షల యాక్టివ్‌ టెక్‌ ఉద్యోగ అవకాశాల్లో మిడ్‌-సీనియర్‌ స్థాయి పోస్టులే పెద్ద వాటాను ఆక్రమించాయి. ఈ కేటగిరీలో సుమారు 68 వేల ఉద్యోగాలు ఉండగా.. మొత్తం యాక్టివ్‌ డిమాండ్‌లో వాటి వాటా 55 శాతం. అంటే ప్రతి రెండు టెక్‌ ఉద్యోగాల్లో ఒకటి కంటే ఎక్కువ పోస్టులు ఇప్పటికే కొంత పని అనుభవం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకున్నవే. ఈ తరహా ఉద్యోగాలు నెలవారీగా 6 శాతం, ఏడాదిలో 19 శాతం పెరిగాయి. ప్రస్తుతం కంపెనీలు చేపడుతున్న అనేక ప్రాజెక్టుల్లో వెంటనే పని చేయగల టాలెంట్‌ అవసరం ఎక్కువగా ఉంది. అందుకే సంబంధిత టెక్నాలజీపై ప్రాక్టికల్‌ అనుభవం, క్లయింట్‌ ప్రాజెక్టులు నిర్వహించిన అనుభవం, సమస్యలను స్వతంత్రంగా పరిష్కరించే సామర్థ్యం ఉన్న అభ్యర్థులకు డిమాండ్‌ పెరుగుతోంది. మరోవైపు Entry-level ఓపెనింగ్స్‌ గతేడాదితో పోలిస్తే 15 శాతం పెరిగాయి. Mid-Junior పోస్టుల ఓపెనింగ్స్ 7 వేలకు చేరి 40 శాతం పెరుగుదల నమోదైంది.

GCCల నుంచి కూడా భారీ డిమాండ్‌..

గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (GCCలు) కూడా భారత టెక్‌ ఉద్యోగ మార్కెట్‌ రికవరీకి బలమైన ఊతమిస్తున్నాయి. బహుళజాతి సంస్థలు తమ గ్లోబల్‌ ఆపరేషన్స్‌లో కీలకమైన టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, డేటా, ఫైనాన్స్‌, రీసెర్చ్‌ వంటి కార్యకలాపాలను భారత్‌లోని GCCలకు అప్పగిస్తున్నాయి. దీంతో కేవలం సాంప్రదాయ ఐటీ సర్వీసులకే కాకుండా.. అధిక నైపుణ్యం అవసరమైన టెక్‌ ఉద్యోగాలకు కూడా డిమాండ్‌ పెరుగుతోంది. అక్టోబర్‌లో GCCల్లో 18 వేల యాక్టివ్‌ టెక్‌ ఓపెనింగ్స్‌ నమోదయ్యాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేకపోయినా.. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఏకంగా 64 శాతం వృద్ధి నమోదైంది. అంటే ఏడాది వ్యవధిలో GCCల నుంచి టెక్‌ టాలెంట్‌కు డిమాండ్‌ గణనీయంగా పెరిగిందన్నమాట. ఈ పెరుగుదల భారతదేశాన్ని కేవలం ఐటీ సేవల కేంద్రంగా కాకుండా.. గ్లోబల్‌ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఇంజినీరింగ్‌ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మార్చే ధోరణిని సూచిస్తోంది. ముఖ్యంగా AI, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ వంటి నైపుణ్యాల్లో GCCలు నియామకాలు పెంచుతున్నాయి.

హైదరాబాద్‌ ఎక్కడుంది?

టెక్‌ హైరింగ్‌లో బెంగళూరు ఇప్పటికీ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అక్టోబర్‌లో అక్కడ సుమారు 31 వేల యాక్టివ్‌ టెక్‌ ఓపెనింగ్స్‌ నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్‌, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ నిలిచాయి. హైదరాబాద్‌లో 14 వేల, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 9 వేల టెక్‌ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.  అయితే ఈసారి ప్రత్యేకంగా గమనించాల్సిన మార్పు.. టెక్‌ ఉద్యోగాల భౌగోళిక విస్తరణ. బెంగళూరు, హైదరాబాద్‌ వంటి సంప్రదాయ ఐటీ కేంద్రాలకే నియామకాలు పరిమితం కాకుండా.. టైర్‌-2, టైర్‌-3 నగరాల్లోనూ టెక్‌ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. అక్టోబర్‌లో ఈ నగరాల్లో కలిపి సుమారు 40 వేల యాక్టివ్‌ టెక్‌ ఓపెనింగ్స్‌ ఉండగా.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే డిమాండ్‌ ఏకంగా 67 శాతం పెరిగింది.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు బ్రేక్‌?

టెక్‌ ఉద్యోగాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఉద్యోగం చేసే విధానంలో మాత్రం కంపెనీలు స్పష్టమైన దిశను చూపిస్తున్నాయి. అక్టోబర్‌లో నమోదైన మొత్తం యాక్టివ్‌ టెక్‌ ఓపెనింగ్స్‌లో ఏకంగా 81 శాతం (1 లక్ష) వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ (WFO) ఉద్యోగాలే ఉండటం దీనికి నిదర్శనం. అంటే కొత్తగా నియమితులయ్యే ఉద్యోగులు కార్యాలయాల నుంచే పనిచేయాలని కంపెనీలు ఎక్కువగా కోరుకుంటున్నాయి. కరోనా తర్వాత విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన రిమోట్‌, హైబ్రిడ్‌ విధానాల స్థానంలో.. క్రమంగా ఆఫీసు ఆధారిత పని విధానం మళ్లీ ప్రధానంగా మారుతోంది.

మొత్తంగా చూస్తే.. భారత టెక్‌ ఉద్యోగ మార్కెట్‌ ఇప్పుడు వరుసగా కోలుకుంటోంది. అయితే  మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం, AI సాధనాలను సమర్థంగా వినియోగించగల సామర్థ్యాన్ని పెంచుకోవడం ఉద్యోగార్థులకు కీలకం కానుంది. AIని అర్థం చేసుకుని పని చేయగల సామర్థ్యం ఇక అదనపు అర్హత ఏమాత్రం కాదు.. తప్పనిసరి అర్హతగా మారుతోంది.