Raghoo puri 
జాతీయ వార్తలు

లాడెన్‌ దాక్కున్న చోటే దావూద్‌.. ఐరాస నివేదికపై భారత్‌ అభ్యంతరం

దావూద్ ఇబ్రహీం భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌ అని, ఐరాస నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించలేదని భారత ప్రతినిధి రఘు పూరీ అభ్యంతరం తెలిపారు.

Vijay Bhaskar

న్యూయార్క్: ముంబై దాడుల సూత్రధారి, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీంకు చెందిన ‘డి-కంపెనీ’ని భారత్‌ కేంద్రంగా పనిచేస్తున్న నేర ముఠాగా ఐక్యరాజ్యసమితి పేర్కొనడంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు మానవ హక్కుల పరిరక్షణపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి బెన్‌ సాల్‌ సమర్పించిన నివేదికను తప్పుల తడకగా అభివర్ణించింది. దావూద్‌ ఇబ్రహీం పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడని, గతంలో అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌కు ఆశ్రయం కల్పించిన ప్రాంతంలోనే అతడూ ఉన్నాడని భారత్‌ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు వివిధ దేశాలు చేపడుతున్న చర్యలపై ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలోని మూడో కమిటీలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా బెన్‌ సాల్‌ సమర్పించిన నివేదికలో ‘డి-కంపెనీ’ని భారత్‌ కేంద్రంగా పనిచేస్తున్న నేర ముఠాగా పేర్కొనడంపై ఐరాసలోని భారత శాశ్వత మిషన్‌ ఫస్ట్‌ సెక్రటరీ రఘు పూరీ అభ్యంతరం లేవనెత్తారు. నివేదికలోని ఈ వ్యాఖ్య వాస్తవాలను ప్రతిబింబించడం లేదని పేర్కొంటూ భారత్‌ వైఖరిని వెల్లడించారు.

భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌

‘‘మా దేశం గురించి నివేదికలో పేర్కొన్న కొన్ని తప్పులను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అల్‌ఖైదాతో సంబంధాల నేపథ్యంలో 2003లో ఐరాస భద్రతా మండలి ‘భారత్‌ కేంద్రంగా పనిచేస్తున్న డి-కంపెనీ’ నాయకుడిని నిషేధిత జాబితాలో చేర్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. 1993 ముంబై ఉగ్రదాడుల కేసుల నుంచే దావూద్‌ ఇబ్రహీం భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నాడు. అయితే ఈ వాస్తవాన్ని ప్రస్తావించడంలో ఐరాస ప్రతినిధి విఫలమయ్యారు’’ అని రఘు పూరీ స్పష్టం చేశారు. దావూద్‌పై చర్యలు తీసుకోవడానికి గల కారణాలు ఐరాస ఆంక్షల జాబితాలోనే స్పష్టంగా నమోదై ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అల్‌ఖైదా, ఒసామా బిన్‌ లాడెన్‌తో సంబంధాల కారణంగా ఐరాస నిషేధం విధించడానికి చాలా కాలం ముందే దావూద్‌ భారత్‌ నుంచి పారిపోయాడని వెల్లడించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఒసామా బిన్‌ లాడెన్‌ ఆశ్రయం పొందిన దేశంలోనే దావూద్‌ ఇబ్రహీం కూడా తలదాచుకుంటున్నాడని ఘాటుగా వ్యాఖ్యానించారు.