India to emerge as global car manufacturing hub 
జాతీయ వార్తలు

ఈయూ కార్ల తయారీ హబ్‌గా భారత్: వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్

దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో నూతన శకం ఆరంభం కానుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ఐరోపా కఠిన నిబంధనలతో కార్ల కంపెనీలు భారత్‌ వైపు మొగ్గుచూపుతాయని గోయల్‌ పేర్కొన్నారు.

Srinivas Rao

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో నూతన శకం ఆరంభం కానుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ఐరోపా దేశాల్లో అమలవుతున్న కఠిన నిబంధనల నేపథ్యంలో అక్కడి కార్ల తయారీ సంస్థలు భారత్‌లో వాహనాల ఉత్పత్తికి మొగ్గుచూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ‘ది ఢిల్లీ డైలాగ్‌’ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ రంగంలో భారత్‌ కీలక ఉత్పత్తి కేంద్రంగా ఎదుగుతోందని వివరించారు.

 ఈయూ నిబంధనలు.. భారత్‌కు వరం!

ఐరోపా సమాఖ్య నిబంధనలను కఠినతరం చేయడంతో పోటీని తట్టుకోవడం అక్కడి కార్ల తయారీ సంస్థలకు సవాలుగా మారిందని పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలు విదేశీ సంస్థలు భారత్‌లోనే వాహనాలను తయారు చేసేందుకు ఆసక్తి చూపుతాయని తెలిపారు. టాటా మోటార్స్‌ జాగ్వార్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించే క్రమంలో కొన్ని మోడళ్ల ఉత్పత్తిని భారత్‌కు తరలించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ పరిణామాలు దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టనున్నాయని వివరించారు.

 లక్ష కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతుల ద్వారా లక్ష కోట్ల డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–ఆగస్టు మధ్య ఎగుమతులు 17.85 శాతం వృద్ధితో 215.91 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతులు 18.21 శాతం పెరిగి 363 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు, దిగుమతుల్లో నమోదవుతున్న వృద్ధి దేశీయ పారిశ్రామిక రంగంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ ఆశావహ దృక్పథాన్ని పెంచుతోందని అధికారులు తెలిపారు.