దసరా, దీపావళి సందడి సామాన్య ప్రజలకు దూరమవుతున్న వేళ, ఆర్థిక పరిస్థితులపై తాజా సర్వే ఆందోళన కలిగిస్తోంది.
ప్రభాత ఉదయం, సెంట్రల్ డెస్క్: దసరా, దీపావళి వచ్చిందంటే మార్కెట్లు కళకళలాడతాయి. షాపింగ్ మాల్స్ కిటకిటలాడతాయి. అయితే ఆ జిలుగులు సాధారణ ప్రజల జీవితాలకు రోజురోజుకూ దూరమైపోతున్నాయి. వరుస పండుగల సందర్భంగా పోలింగ్ సంస్థ సీఓటర్ (సెంటర్ ఫర్ ఓటింగ్ ఎనాలసిస్ అండ్ ఆల్టర్నేటివ్ రిసెర్చ్) నిర్వహించిన తాజా సర్వే దేశ ప్రజల ఆర్థిక స్థితిని బట్టబయలు చేసింది. ఏడాది క్రితంతో పోలిస్తే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని 53.6 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు. 11.6 శాతం మంది మాత్రమే పరిస్థితి బాగుపడిందని చెప్పడం ఆందోళన కలిగించే విషయం.
గ్రామీణుల్లో మరింత దయనీయం
నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉందని ఆ సర్వేలో పేర్కొన్నారు. తమ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని 40.6 శాతం మంది నగరవాసులు, 59.2 శాతం మంది పల్లెవాసులు చెప్పారు. ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి వర్గాల్లో 63.2 శాతం కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నట్లు తేలింది. సంపన్న వర్గాల్లో మాత్రం 26.3 శాతం మందే సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ‘‘మార్కెట్లో కనిపిస్తున్న సందడి పైకి మాత్రమే.. ప్రజలు అత్యవసర అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప, దీర్ఘకాలిక వ్యయాలకు సిద్ధంగా లేరు’’ అని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.
సంప్రదాయాల కోసమే..
ఎన్ని కష్టాలున్నా ప్రజలు సంప్రదాయాన్ని వదులుకోలేరు. కాబట్టి దానిని కొనసాగించడం కోసం అవసరాల మేరకే ఖర్చులు చేస్తున్నారు. కొత్త దుస్తులు కొంటున్నట్లు 45 శాతం మంది చెప్పగా, అది కూడా పిల్లల కోసమే అంటూ ఎక్కువ మంది నిట్టూర్చారు. మరో 45.4 శాతం మంది ప్రజలు అసలు దుస్తులే కొనడం లేదని చెప్పారు. అలాగే విదేశీ చాక్లెట్ల కంటే స్థానిక మిఠాయి దుకాణాలకే 33 శాతం మంది మొగ్గు చూపుతున్నట్టు తెలిపారు.
భారీ కొనుగోళ్లంటే బెంబేలు
ఎక్కువ ఖర్చు పెట్టాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. బంగారం, టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలు, కార్లు లాంటి ఖరీదైన వస్తువులను కొనేందుకు వెనకాడుతున్నారు. కిచెన్ అప్లయన్సెస్ కొనడానికి 21.5 శాతం, ఎలక్ట్రానిక్స్ కొనడానికి 18.5 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. ఇళ్లకు రంగులు వేయడం లేదా మరమ్మతులు చేయడంలో సగం మంది వెనకడుగు వేస్తున్నారనేది సర్వేలో తేలింది.
ఫుణ్యక్షేత్రాలు చాలు..
అలాగే విదేశీ పర్యటనలకు కూడా స్వస్తి పలికి, సమీప ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల దర్శనానికే 47.5 శాతం మంది మొగ్గు చూపారు. వేడుకల హడావుడి కనిపిస్తున్నా, గతంలో ఉండే సంతృప్తి, సంతోషం కనిపించడం లేదు.