ముంబై: భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో యుద్ధనౌక (ఐఎన్ఎస్ మంగ్రోల్) వచ్చి చేరింది. శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించి, వాటిని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ యుద్ధ నౌకను రూపొందించారు. సోమవారం ముంబైలో నౌకాదళంలో ‘ఐఎన్ఎస్ మంగ్రోల్’ (INS Mangrol)ను చేర్చారు. తీర ప్రాంతాలు, నౌకాశ్రయాలు, సముద్ర వాణిజ్య మార్గాల రక్షణలో ఈ యుద్ధనౌక కీలక పాత్ర పోషిస్తుందని నౌకాదళ అధికారులు చెబుతున్నారు. నీటి లోతు తక్కువగా ఉండే సముద్ర ప్రాంతాల్లోనూ సమర్థంగా పనిచేయడం ఈ యుద్ధనౌక ప్రత్యేకత. శత్రుదేశాల జలాంతర్గాములు భారత తీర ప్రాంతాలకు సమీపంలోకి వచ్చినప్పుడు వాటిని గుర్తించి, అవసరమైతే ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ యుద్ధనౌకను రూపొందించారు.
ప్రత్యేకతలు ఇవే..
ఐఎన్ఎస్ మంగ్రోల్(INS Mangrol)లో అబయ్ హల్ మౌంటెడ్ సోనార్ వ్యవస్థ ఉంది. నీటిలోని శబ్ద తరంగాల ఆధారంగా నీటి అడుగున ఉన్న వస్తువులను గుర్తించడం ఈ యుద్ధనౌక ప్రత్యేకత. శత్రుదేశాల జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకునే తేలికపాటి టార్పెడోలు, జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లను ఐఎన్ఎస్ మంగ్రోల్ ప్రయోగించగలదు. శత్రుదేశాల టార్పెడోలను దారి మళ్లించేందుకు మారీచ్ అడ్వాన్స్డ్ టార్పెడో డెకాయ్ వ్యవస్థను అమర్చారు.
తక్కువ లోతున్న ప్రాంతాల్లోనూ..
ఐఎన్ఎస్ మంగ్రోల్ తక్కువ లోతు ఉన్న ప్రాంతాల్లోనూ ప్రయాణించగలదు. ఈ నౌకలో మొత్తం మూడు డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. వాటర్‌జెట్ ప్రొపల్షన్ వ్యవస్థ ద్వారా ఇది ముందుకు కదులుతుంది. అంటే నీటిని అధిక వేగంతో వెనక్కి పంపి నౌకను ముందుకు నడిపించే సాంకేతిక వ్యవస్థను రూపొందించారు. దీంతో తక్కువ లోతు ఉన్న సముద్ర ప్రాంతాల్లోనూ ఈ నౌక వేగంగా కదులుతుంది. నీటి అడుగున నిఘా పెట్టేందుకు, తక్కువ తీవ్రత కలిగిన సముద్ర భద్రతా కార్యకలాపాలు, సముద్ర గనులకు సంబంధించిన పనుల్లోనూ ఈ నౌకను ఉపయోగించుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
80 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానం
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 80 శాతానికిపైగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యుద్ధ నౌకను నిర్మించింది. యుద్ధ నౌకల నిర్మాణం, ఆధునిక ఆయుధాలు, సెన్సార్ల తయారీలో భారత్ సాధిస్తున్న పురోగతికి ఐఎన్ఎస్ మంగ్రోల్ తయారీ నిదర్శమని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ తెలిపింది.
నౌకాదళ సామర్థ్యం పెంచుకుంటున్నాం
భారత నౌకాదళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటున్నామని నౌకాదళ కమాండ్ అధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ తెలిపారు. 2026లో ఇప్పటివరకు 10 నౌకలను నౌకాదళంలో ప్రవేశపెట్టామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి మరో ఎనిమిది నౌకలను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం నౌకాదళంలో 131 నౌకలు, 20 జలాంతర్గాములు ఉన్నాయని చెప్పారు. మరో 42 నౌకలు నిర్మాణదశలో ఉన్నాయని సంజయ్ వత్సాయన్ తెలిపారు.