న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య తొలి విడత వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరువైందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పరస్పర ప్రయోజనాలు నెరవేరడంతో పాటు, పోటీ దేశాల కంటే భారత ఎగుమతిదారులకు మెరుగైన ప్రయోజనాలు లభించినప్పుడే ఒప్పందంపై సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేషియా ఎగుమతిదారులతో పోలిస్తే భారతీయ ఎగుమతిదారులకు సుంకాల విషయంలో తగిన వెసులుబాటు కల్పించాలని భారత్ ఆశిస్తోందన్నారు.
గత ఫిబ్రవరిలో ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక విధివిధానాలపై అంగీకారానికి వచ్చాయి. ఆగస్టులో విధించిన భారీ సుంకాలు 18 శాతానికి తగ్గాయి. అయితే, రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా కొత్త చట్టం తీసుకొచ్చే నేపథ్యంలో చర్చల్లో కొంత జాప్యం జరుగుతోంది. త్వరలోనే ఒప్పందం కొలిక్కి వస్తుందని వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు.
రూబియో పర్యటన
ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 17 నుంచి 22 వరకు భారత్, ఉజ్బెకిస్థాన్‌లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వాణిజ్య భాగస్వామ్యం, ఇంధన సహకారంపై చర్చలు జరగనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాతో భారత్ దాదాపు 34 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులును నమోదు చేసింది.