జాతీయ వార్తలు

అప్పుల ఊబిలో కేంద్రం

Tejaswini

కేంద్ర ప్రభుత్వం పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశం ఒక పెద్ద అప్పుల కుప్పలా తయారైంది. గత 12 ఏండ్లుగా మోదీ సర్కార్ చేస్తున్న అప్పులు 2026 మార్చి నాటికి రూ.200.53 లక్షల కోట్లకు చేరుకున్నాయి. క్రికెట్ భాషలో చెప్పాలంటే మనదేశం రుణభారం (లక్షల కోట్లు) డబుల్ సెంచరీ కొట్టింది. ప్రతి ఏటా కొత్త అప్పులు చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత భయానకంగా మారుస్తున్నది. 2026 మార్చి నాటికి మోదీ సర్కార్ చేసిన అప్పులు రూ.200.53 లక్షలకు పెరిగాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ రుణభారం రూ.218.63 లక్షల కోట్లకు చేరుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే నాటికి కేంద్ర ప్రభుత్వ రుణభారం సుమారు రూ.55.87 లక్షల కోట్లుగా ఉందని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. ఆ తర్వాత ఈ 12 ఏండ్లలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్ చేస్తూ వస్తున్న అప్పులు భారీగా పెరిగాయని కేంద్ర బడ్జెట్ పత్రాలే వెల్లడిస్తున్నాయి.

12 ఏండ్లలో రూ.162 లక్షల కోట్లు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ అంటే 67 సంవత్సరాల సుదీర్ఘకాలంలో కేంద్రం చేసిన అప్పులు రూ.55.87 లక్షల కోట్లు కాగా ప్రధానిగా మోదీ పాలన మొదలైన 2014 సంవత్సరం నుంచి 2026 మార్చి నెల వరకూ కేవలం 12 సంవత్సరాల వ్యవధిలోనే కొత్తగా రూ.162,75,851 కోట్లు అప్పులు చేశారు.  అప్పులు, వాటిపైన వడ్డీలకే ప్రతి ఏటా రికార్డు స్థాయిలో రూ.14.04 లక్షల కోట్లను చెల్లించాల్సి వస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి (2027 మార్చి) కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.218.63 లక్షల కోట్లకు చేరుకుంటాయని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.

తీసుకొచ్చిన అప్పులతో ఏం చేశారు?

రాష్ట్రాలు చేసిన అప్పులపై గగ్గోలు పెడుతున్న కేంద్రం ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయలు అప్పులు తేవటమన్నది సామాన్యుడికి అర్థం కాకుండా ఉంది. ఇన్నేండ్లుగా అప్పులతో సమకూరిన రూ.162.75 లక్షల కోట్ల నిధులు ఏమైపోయాయి? ఎక్కడెక్కడ, ఏయే రంగాలకు ఎంతెంత ఖర్చు చేశారు? అనే లెక్కలు ఎవ్వరికీ నిజాయతీగా చెప్పడంలేదు. ప్రపంచబ్యాంకు, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కూడా భారత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ, అక్కౌంట్స్, జీడీపీ వివరాలు నమ్మశక్యంగా లేవని వ్యాఖ్యానించాయి. మోదీ ప్రభుత్వం విడుదల చేసే దేశ అభివృద్ధి గణాంకాలు, తలసరి ఆదాయం లెక్కలు నమ్మలేమని దీనినిబట్టి తెలుస్తున్నది. భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన వృద్ధి గణాంకాలపైనా పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సహా పలువురు నిపుణులు కేంద్రం విడుదల చేసిన వృద్ధి గణాంకాలపై అనుమానం వ్యక్తం చేశారు.

ఎఫ్ఆర్‌బీఎం చట్టానికి పూర్తి విరుధ్ధం..

స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో మన దేశ అప్పులు 56 శాతానికి పెరిగాయని, ఇలా అప్పులు చేయడం ఎఫ్ఆర్‌బీఎం చట్టానికి పూర్తి విరుధ్ధమని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రాలు ఎఫ్ఆర్‌బీఎం చట్టానికి లోబడి మాత్రమే అప్పులు చేయాలని అనేక రకాల ఆంక్షలు విధిస్తున్న కేంద్రం తాను మాత్రం ఎడాపెడా అప్పులు చేస్తున్నది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలుజేస్తున్న రాష్ట్రాల అప్పుల్ని మాత్రం కేంద్రం భూతద్దంలో చూపుతున్నది. కేంద్రం తీరు బీజేపీ పాలిత రాష్ట్రాలకూ మింగుడుపడటం లేదు. తెలంగాణ రాష్ట్రం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఎఫ్ఆర్‌బీఎం చట్టం ప్రకారం దేశ జీడీపీలో 40 శాతం వరకే అప్పులు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాలు తమ జీఎస్‌డీపీలో 20 శాతం పరిమితి దాటరాదు. దీని ప్రకారం కేంద్రం చేసిన అప్పులు ఇప్పటికే 56 శాతానికి చేరుకున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రతినెలా అవసరం ఉన్నా, లేకపోయినా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూనే ఉంది. ఎఫ్ఆర్‌బీఎం చట్టాన్ని మోదీ సర్కార్ యథేచ్ఛగా ఉల్లంఘించిందని, కనీసం ఒక్క నెల కూడా అప్పు చేయకుండా దేశాన్ని నడుపలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

కార్పొరేట్ కంపెనీల లబ్ధి కోసమేనా!

ఏ ప్రభుత్వమైనా అప్పులు చేయడం సహజం. అత్యవసర పరిస్థితులు, ప్రజా అవసరాలను పరిగణనలోకి తీసుకొని మాత్రమే అప్పులు చేయాలన్నది ఆర్థిక నిపుణుల మాట. ఏ అవసరం కోసమైతే అప్పులు చేస్తున్నామో అదే పనికి, ఆ అవసరాలకు మాత్రమే ఖర్చు చేయాలన్నది ఆర్థిక నియమం. కానీ గత 12 ఏండ్లుగా మోదీ సర్కార్ ఎవరి కోసం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసిందనేది చెప్పలేదు. అనుత్పాదక రంగాలకు నిధులు కేటాయిస్తూ దుర్వినియోగం చేసిందనే విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. కొన్ని కారొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పార్లమెంట్‌లో విపక్ష పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. లక్షల కోట్లు అప్పులు చేయటంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడం, మరి కొన్నింటిని బలహీనపర్చటం వంటి చర్యలు వివాదాస్పదంగా మారాయి. కేంద్రంలో మోదీ సర్కార్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారిందనే విమర్శలున్నాయి.

తాగునీరు..విద్యుత్తుకు ఏది ప్రాధాన్యత!

లక్షల కోట్లు అప్పులు చేసిన కేంద్రం, తాగు, సాగునీటికి సంబంధించి భారీ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఆర్థికంగా సహకరించే ఏఐబీపీ (ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం) పథకాన్ని రద్దు చేసిన ఘనత మోదీ సర్కార్‌దే. అత్యవసర నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించడానికి కేంద్రం సుముఖంగా లేదు. దేశంలో పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు తగినంతగా కరెంటు ఉత్పత్తి కావటం లేదు. గ్రామీణ రోడ్ల నిర్మాణాలకు అవసరమైన నిధులను ఇవ్వాలని రాష్ర్టాలు కోరుతున్నా కేంద్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతేగాక ఆహార భద్రతా చట్టాన్ని, ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తున్నది. రైతుల పంటలను (వరి, గోధుమ) కొనుగోలు చేయాల్సిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి నిధులు ఇవ్వనందు వల్లే, ఆహారధాన్యాలతో నిండుగా ఉండాల్సిన ఎఫ్‌సీఐ గోడౌన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయని సమాచారం.

సంవత్సరం                కేంద్రం అప్పులు

2014లో                        రూ.55.87 లక్షల కోట్లు

2026 మార్చి                  రూ.200.53 లక్షల కోట్లు

2027 మార్చి నాటికి             రూ.218.63 లక్షల కోట్లు

  • అప్పులపై వడ్డీభారం             ఏటా రూ.14.04 లక్షల కోట్లు

  • పెరిగిన అప్పులు           రూ.162.75 లక్షల కోట్లు

  • ప్రతి నెలా సగటున               రూ.1.17 లక్షల కోట్లు

  • ప్రతి రోజుకు సగటున    రూ.3,847 కోట్లు