జాతీయ వార్తలు

‘జంతర్​ మంతర్’ ఇక​ గప్​చుప్​!

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌తో నిరసనలు కొనసాగుతున్న వేళ.. ఢిల్లీలోని నిరసన ప్రదేశాల జాబితా నుంచి జంతర్​ మంతర్​ను తొలగిస్తూ ఢిల్లీ పోలీసులు డీనోటిఫై ఉత్తర్వులను జారీ చేశారు.

Haji Pasha

న్యూఢిల్లీ:  జనం గుండె చప్పుడు జంతర్​ మంతర్​ మూగబోనుంది. గత 33 ఏళ్లుగా ప్రజా గళానికి,  ప్రజాస్వామిక నిరసనలకు వేదికగా నిలుస్తూ వచ్చిన ఈ చారిత్రక ప్రదేశంలో నిశ్శబ్దం రాజ్యమేలనుంది. ​ అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం (2011), నిర్భయ ఉదంతంపై నిరసనలు (2012), రెజ్లర్ల నిరసనలు (2023), కాక్రోచ్ జనతా పార్టీ విద్యా సంస్కరణల ఉద్యమం (2026) వంటివన్నీ జంతర్​ మంతర్​ వేదికగానే జరిగాయి. అలాంటి జంతర్ మంతర్ ఇకపై నిరసన ప్రదర్శనలకు వేదిక నిలువదంటూ ఢిల్లీ పోలీసులు సంచలన ప్రకటన చేశారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్​(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జంతర్​ మంతర్​ వేదికగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

డీనోటిఫై ఉత్తర్వులు

ఢిల్లీలోని నిరసన ప్రదేశాల జాబితా నుంచి జంతర్​ మంతర్​ను తొలగిస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్​ కుమార్​ ఆదివారం రోజు (అక్టోబరు 11న) డీనోటిఫై ఉత్తర్వులను జారీ చేశారు. కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన ఒక ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు ఈ అధికారిక ఉత్తర్వులిచ్చారు. దీని ప్రకారం ఇకపై జంతర్ మంతర్ వద్ద ఎలాంటి రాజకీయ ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు, ప్రజా ప్రదర్శనలు నిర్వహించడానికి చట్టబద్ధమైన అనుమతి ఉండదు. దీని స్థానంలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్​, బురారీ గ్రౌండ్​, సీబీడీ గ్రౌండ్​లను కొత్త వేదికలుగా వాడుకోవచ్చని సూచించారు. ఈ కొత్త వేదికల్లో నిరసనలు, ప్రదర్శనల నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలను సవరించి త్వరలోనే ప్రత్యేక ఉత్తర్వును విడుదల చేస్తామని పేర్కొన్నారు. గతంలో 2022 ఏప్రిల్​ 28న తాము జారీచేసిన నియమ నిబంధనల ఉత్తర్వుల్లోనూ (స్టాండింగ్​ ఆర్డర్స్) ఈ పాక్షిక సవరణల ప్రస్తావన ఉందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ డీనోటిఫై ఉత్తర్వులో పొందుపరిచారు.

రేపు ప్రజాస్వామ్యాన్నే డీనోటిఫై చేస్తారేమో : దీప్కే

నిరసన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్​ను డీనోటిఫై చేయడంపై కాక్రోచ్​ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్​ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు యావత్​ భారతదేశం జంతర్​ మంతర్​గా మారిపోతుందని ఆయన హెచ్చరించారు. “వాళ్లు జంతర్​ మంతర్​ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తీసేశారు. ​ఔను, అదిప్పుడు నిరసన ప్రదేశం కాదు. పిరికిపందలైన నియంతలు దాన్నొక యుద్ధ రంగం (వార్​ జోన్​)గా మార్చారు. ఇప్పుడు యావత్​ దేశం జంతర్​ మంతర్​గా మారిపోతుంది” అని పేర్కొంటూ దీప్కే ట్వీట్​ చేశారు. ‘‘ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే, రేపు భారత్​ ప్రజాస్వామిక దేశం అనే దాన్నీ  ప్రభుత్వం డీనోటిఫై చేస్తుందనిపిస్తోంది. జంతర్​ మంతర్​ను డీనోటిఫై చేయడమనేది ఆ దిశగానే ఒక అడుగేమో అనిపిస్తోంది” అని మరొక ట్వీట్​లో ఆయన విమర్శించారు. మన దేశాన్ని పాలిస్తున్న నియంతకు ఈ నిరసన ప్రదేశంతో సమస్య లేదని, ప్రజా నిరసనలనే ఆలోచనతోనే ఆయనకు ఇబ్బంది కలుగుతోందని అభిజీత్​ దీప్కే ఫైర్​ అయ్యారు.

ఏకపక్ష నిర్ణయం ఆమోదయోగ్యం కాదు : సీజేపీ

జంతర్ మంతర్​ను డీనోటిఫై చేయడంపై సీజేపీ కో–కన్వీనర్ సౌరవ్​ దాస్​ మండిపడ్డారు. ఢిల్లీ పోలీసులు తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, ​దీన్ని అంగీకరించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. జంతర్​ మంతర్​ను చూసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈమేరకు సోమవారం ఒక ట్వీట్​ చేశారు. ‘‘జంతర్​ మంతర్​ భారతదేశ ప్రజలది. కేంద్ర హోంశాఖ వాళ్లు భారతదేశ ప్రజలను సంప్రదించారా ? కనీసం ఆ ప్రదేశంతో అనుబంధం కలిగిన వాళ్లతోనైనా మాట్లాడారా ? ఏవైనా సంస్థల అభిప్రాయాలనైనా సేకరించారా ?” అని సౌరవ్​ దాస్​ ప్రశ్నించారు. నిరసన తెలిపేందుకు, శాంతియుతంగా సమావేశమయ్యేందుకు దేశ ప్రజలకున్న ప్రాథమిక హక్కుపై కేంద్ర సర్కారు దాడి చేసిందని ఆయన మండిపడ్డారు. ఇక యావత్​ దేశం జంతర్​ మంతర్​గా మారుతుందని అల్టిమేటం ఇచ్చారు.

మోదీ, షాల ధ్యాసంతా ‘డెమోకుర్సీ’పైనే : కాంగ్రెస్​

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్​షాలకు డెమోక్రసీ (ప్రజాస్వామ్యం) అంటే పట్టడం లేదని, వాళ్ల ధ్యాసంతా ‘డెమోకుర్సీ’పైనే ఉందని కాంగ్రెస్​ విరుచుకుపడింది. ప్రజాస్వామ్యానికి ప్రతిరోజూ బూస్టర్​ డోస్​ను అందించే చారిత్రక వేదికగా ఇక జంతర్​ మంతర్ నిలువకుండా మోదీ, షా ద్వయం అడ్డుకుందని ఆరోపించింది. ఇది అత్యంత ఆందోళనకర పరిణామమని పేర్కొంటూ కాంగ్రెస్​ పార్టీ జాతీయ ​ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఒక ట్వీట్​ చేశారు. ‘‘విషపూరితమైన మోదీ, షా ద్వయం గత కొన్నిరోజుల వ్యవధిలో ఢిల్లీలో ఏమేం చేయించిందో మనమంతా చూశాం. శాంతియుత నిరసన ప్రదర్శనలను వాళ్లు ఎంత క్రూరంగా అణచివేశారో అందరూ చూశారు”అని ఆయన వ్యాఖ్యానించారు.  

అసలేమిటీ జంతర్​ మంతర్ ?  

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ ఒక చారిత్రాత్మక ఖగోళ పరిశోధనా శాల. ఇది ఉన్న ప్రదేశం ప్రస్తుతం నిరసనలకు వేదికగా ప్రసిద్ధి చెందినప్పటికీ, అంతరిక్షం, గ్రహాల గమనాన్ని పరిశీలించాలనే అసలు ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. ఈ చారిత్రక కట్టడాన్ని రాజస్థాన్​లోని జైపూర్ సంస్థానానికి చెందిన రాజు మహారాజా సవాయ్ జైసింగ్–2 నిర్మించారు. ఆయన గొప్ప పాలకుడిగానే కాకుండా గణిత శాస్త్రజ్ఞుడిగా, ఖగోళ శాస్త్రజ్ఞుడిగా పేరొందారు. ఆ కాలంలో నక్షత్రాలు, గ్రహాల స్థానాలను లెక్కించడానికి ఉపయోగించే క్యాలెండర్లు, ఖగోళ పట్టికలలో చాలా తప్పులు ఉండేవి. వాటిని సరిచేసి, సమయాన్ని కచ్చితంగా కొలవడానికి, సూర్య చంద్రుల గమనాన్ని గమనించడానికి చక్రవర్తి అనుమతితో జైసింగ్ దీన్ని నిర్మించారు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా కాలంలో, 1724లో ఈ కట్టడం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇక్కడ రాతితో నిర్మించిన పెద్ద పెద్ద నిర్మాణాలు అన్నీ ఒక్కొక్క ఖగోళ పరికరంలా పనిచేస్తాయి. ఇందులోని సమ్రాట్ యంత్రం అనేది ఒక భారీ సూర్య గడియారం. ఇది సూర్యుడి నీడ ఆధారంగా సమయాన్ని కచ్చితంగా చెప్తుంది. రామ యంత్రం అనేది గ్రహాలు, నక్షత్రాల ఎత్తును, వాటి స్థానాలను కొలవడానికి ఉపయోగపడుతుంది.

జంతర్​ మంతర్​కు ఆ పేరు ఎలా వచ్చింది ?

ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ అనేది ఒకే ఒక్క భవనం కాదు. ఇదొక విశాలమైన బహిరంగ ఆవరణలో నిర్మించిన పెద్ద పెద్ద రాతి కట్టడాల సమూహం. వీటిని దూరం నుంచి చూస్తే వింత ఆకారాల్లో ఉన్న భవనాల్లా కనిపించినప్పటికీ, నిజానికి ఇవన్నీ గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని, సమయాన్ని లెక్కించడానికి ఉపయోగించే పెద్ద సైన్స్ పరికరాలు (యంత్రాలు). జంతర్​ మంతర్​ అనే పేరు 'యంత్ర మంత్ర' అనే సంస్కృత పదాల నుంచి ఏర్పడింది. కాలక్రమేణా వాడుకలో ఇది జంతర్ మంతర్​గా రూపాంతరం చెందింది. జంతర్ అంటే యంత్రం అని, మంతర్​ అంటే మంత్రం అని అర్థాలు వస్తాయి. అంటే ఖగోళాన్ని కొలిచే, లెక్కించే యంత్రాల సమూహమే జంతర్​ మంతర్.

రాజకీయ నిరసనల వేదికగా ఎలా మారింది?

1993 వరకు ఢిల్లీలో పెద్ద పెద్ద ధర్నాలు, ర్యాలీలు 'బోట్ క్లబ్' (ఇండియా గేట్ సమీపంలో) వద్ద జరిగేవి. అయితే అక్కడ భద్రతా కారణాల వల్ల 1993లో ప్రభుత్వం నిరసనలను నిషేధించి, పార్లమెంటుకు సమీపంలో ఉన్న జంతర్ మంతర్ రోడ్డును అధికారిక నిరసన వేదికగా కేటాయించింది. అప్పటి నుంచి ఇది ధర్నాలకు ప్రధాన కేంద్రంగా మారింది.

జంతర్ మంతర్​పై నిషేధం/నియంత్రణల సందర్భాలివే

·       జంతర్ మంతర్ రోడ్డుపై ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు, మైకుల వాడకం జరగకూడదంటూ 2017 అక్టోబరులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పూర్తి నిషేధం విధించింది. ఇది ఢిల్లీ మాస్టర్ ప్లాన్ ప్రకారం నివాస ప్రాంతమని, అక్కడ నిరసనల వల్ల విపరీతమైన ధ్వని కాలుష్యం, చెత్తాచెదారం పేరుకుపోయి స్థానికుల జీవన హక్కుకు భంగం కలుగుతోందని ఎన్‌జీటీ పేర్కొంది. ఆందోళనకారులను రామ్‌లీలా మైదాన్‌కు తరలించాలని ఆదేశించింది. 

·       ఎన్‌జీటీ విధించిన పూర్తి నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై 2018 జూలైలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నిరసన తెలిపే పౌరుల ప్రాథమిక హక్కును పూర్తిగా నలిపేయలేమని పేర్కొంటూ పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. అయితే, స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టింది. దీని ప్రకారం, అక్కడ నిరసనలకు వచ్చే జనాలు 1,000 మందికి మించకూడదని, పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని గైడ్‌లైన్స్ విధించారు. 

సంక్షిప్తంగా చెప్పాలంటే, 2017లో పర్యావరణ/కాలుష్య కారణాలతో కోర్టు నిషేధం విధించగా, 2026 అక్టోబరులో మాత్రం శాంతిభద్రతలు, భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వం దీనిని శాశ్వత నిరసన వేదికగా రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.