రాంచీ : అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ రోడ్డును మృత్యురూపంలో వచ్చిన ఓ లారీ రక్తసిక్తం చేసింది. మనుషుల గుంపుపై మృత్యుశకటంలా దూసుకొచ్చింది. పిల్లాపాపలతో ఉన్న రెండు కుటుంబాలను నడి రోడ్డుపై రెప్పపాటులో నలిపేసింది. ఏడుగురు ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఇందులో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో బాలిక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ప్రమాదం జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖుంటి జిల్లా కర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రా-తోర్పా ప్రధాన రహదారిపై ఉన్న జోన్-లుద్రు మూలమలుపు వద్ద గురువారం రాత్రి 9:45 గంటల ప్రాంతంలో స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని కాపాడేందుకు అక్కడికి వెళ్లి గుమిగూడారు. సహాయక చర్యలు చేపడుతున్న క్రమంలోనే తోర్పా వైపు నుంచి కర్రా వైపు 18 టైర్ల భారీ ట్రక్కు (లారీ) అతివేగంగా వచ్చింది. మూలమలుపు వద్ద అదుపుతప్పి అక్కడే రోడ్డు పక్కన ఉన్న గుంపుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు స్పాట్లో మృతిచెందగా, మరో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతులను జయంతి దేవి, ఆమె కుమార్తె అంజలి దేవి (20), మనవడు సౌరవ్ నాయక్ (11), మరో మహిళ ఫగన్ సంగా (26), ఆమె కుమార్తెలు శివానీ కుమారి (12), సోని కుమారి (8), అత్త కర్మి లోహ్రైన్ (50)గా పోలీసులు గుర్తించారు. ఖుష్బూ కుమారి అనే బాలిక తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదానికి గురైన వ్యక్తిని రక్షించబోయిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. రెండు కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగింని స్థానికులు ఆరోపించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. ప్రమాదానికి నిరసనగా స్థానికులు శుక్రవారం ఉదయం ఘటనా స్థలం వద్ద రోడ్డు దిగ్బంధం చేసి నిరసన చేపట్టారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి, పీఎం, సీఎం సంతాపం..
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.