పంజాబ్‌లో అదృశ్యమైన సంప్రదాయ పశువుల పరుగు పందేల ఛాంపియన్‌ దున్నపోతు రాజా జోటా. 
జాతీయ వార్తలు

దున్నపోతు అదృశ్యం.. ఆచూకీ చెబితే రూ.లక్ష నజరానా!

పంజాబ్‌లో ఎంతో ప్రజాదరణ పొందిన ‘రాజా జోటా’ అనే దున్నపోతు అదృశ్యమైంది. దాని ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష నగదు బహుమతి అందజేస్తామని యజమాని ప్రకటించారు.

Srinivas Rao

కపుర్తలా : పంజాబ్ సంప్రదాయ పశువుల పరుగు పందేలలో తిరుగులేని ఛాంపియన్‌గా నిలిచిన ప్రసిద్ధ దున్నపోతు ‘రాజా జోటా’ అదృశ్యమైంది. గత 10 రోజులుగా రాజా జాడ కనిపించకపోవడంతో యజమాని కుటుంబంతో పాటు స్థానిక గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాజాను సురక్షితంగా కనిపెట్టి తెచ్చిన వారికి రూ. 1 లక్ష నగదు బహుమతి అందజేస్తామని దాని యజమాని కుటుంబ సభ్యులు ప్రకటించారు.

పోటీలలో అజేయ రికార్డు

20 ఏళ్ల వయసున్న రాజా జోటా.. పంజాబ్‌లో సంప్రదాయ పశువుల పరుగు పందేల్లో పాల్గొని ఎన్నో విజయాలు సాధించింది. దాదాపు 19 ఏళ్లపాటు వందకుపైగా పోటీల్లో పాల్గొని ట్రాక్టర్లు, కార్లు, 70కి పైగా మోటార్‌సైకిళ్లు, నగదు బహుమతులు గెలుచుకుంది. తమ కుటుంబంలో ఒకరిగా భావించే రాజా జోటా కనిపించకపోవడంతో కన్నీరు ఆపుకోలేకపోతున్నానని, భోజనం కూడా చేయలేకపోతున్నామని దాని యజమాని జస్కరన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నేరస్తుల కోసం గాలింపు

పొలం మోటార్ వద్ద కట్టేసి ఉన్న రాజాను గుర్తుతెలియని వ్యక్తులు రాత్రివేళ అపహరించుకుపోయారు. ఆకతాయిలు ఏదైనా మత్తు పదార్థం తినిపించి ఎత్తుకెళ్లి ఉంటారని యజమాని జస్కరన్ సింగ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పంజాబ్ సంప్రదాయ క్రీడలలో అగ్రగామిగా నిలిచిన ‘రాజా జోటా’ క్షేమంగా తిరిగిరావాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.