టోల్‌ ప్లాజాల నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారుల కోసం నవంబర్‌ 1 నుంచి వార్షిక లోకల్‌ ఫాస్ట్‌ట్యాగ్‌ పాస్‌లు 
జాతీయ వార్తలు

నవంబర్​ 1 నుంచే ‘ఫాస్టాగ్​ లోకల్​ పాస్’

టోల్ ప్లాజాలకు 20 కి.మీ పరిధిలో ఉండేవారికి కేంద్రం శుభవార్త చెప్పింది. రూ.1,500 మరియు రూ.3,000 లకే వార్షిక లోకల్ ఫాస్టాగ్ పాస్ నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ.

Haji Pasha

న్యూఢిల్లీ :  జాతీయ రహదారులపై ఉండే టోల్​ ప్లాజాల సమీప ప్రాంతాల్లో నివసించే వాహనదారులకు కేంద్ర రవాణాశాఖ శుభవార్త వినిపించింది. టోల్​ ప్లాజాల చుట్టూ 20 కి.మీ రేంజ్​లో ఉండే ప్రాంతాల్లో నివసించే వారు నవంబర్‌ 1 నుంచి వార్షిక రాయితీతో కూడిన లోకల్‌ ఫాస్ట్‌ట్యాగ్‌ పాస్‌లను పొందవచ్చని ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మున్సిపాలిటీలు, పట్టణాల వెలుపల ఉన్న టోల్‌ ప్లాజాల పరిధిలో నివసించే వారు లోకల్‌ ఫాస్ట్‌ట్యాగ్‌ పాస్‌ కోసం రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. అదే మున్సిపాలిటీలు, పట్టణాల పరిధిలో ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద పాస్‌ పొందాలంటే రూ.3,000 చెల్లించాలని కేంద్ర రవాణా శాఖ తెలిపింది. ఇప్పటికే ఫాస్ట్‌ట్యాగ్‌ ఉన్న స్థానిక వాహనదారులు తమ ప్రస్తుత నెలవారీ పాస్‌ను కొనసాగించవచ్చు లేదా కొత్త వార్షిక లోకల్‌ పాస్‌కు మారవచ్చు. అయితే ఈ పాస్‌ సంబంధిత టోల్‌ ప్లాజా పరిధిలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇతర టోల్‌ ప్లాజాలకు బదిలీ చేసుకునే అవకాశం ఉండదని శాఖ స్పష్టం చేసింది.