జాతీయ వార్తలు

వాణిజ్య సిలిండర్‌పై వడ్డన

- హైదరాబాద్‌లో రూ.69 పెంపు..రూ.3065కి చేరిన ధర - పండుగల వేళ హోటల్స్, రెస్టారెంట్స్‌పై తీవ్ర ప్రభావం - అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన - అథెంటికేషన్‌ పూర్తి చేస్తేనే సబ్సిడీ ధర సిలిండర్

S. Pavan

పండుగల సీజన్ మొదలవుతున్నవేళ వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు కేంద్రం షాకిచ్చింది. చమురు మార్కెటింగ్ సంస్థలు గురువారం కమర్షియల్ సిలిండర్ ధరల్ని మరోమారు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. రాజధాని ఢిల్లీ సహా వివిధ నగరాల్లో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.62.50కుపైగా పెరిగాయి. సవరించిన ధరలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే గృహ వినియోగదారులకు స్వల్ప ఊరట దక్కింది. సబ్సిడీతో కూడిన డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులూ చేయలేదు. తాజా పెంపుదలతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ రూ.2,747.50 నుంచి రూ.2,810కి చేరింది. హైదరాబాద్‌లో రూ.69 పెరుగగా, ధర రూ.3065కి చేరింది. ఈ పెంపు హోటళ్లు, రెస్టారెంట్స్, క్యాటరింగ్ సర్వీసులు, ఇతర వాణిజ్య సంస్థలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నది. బయట ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

ఎల్పీజీ వినియోగదారులకు కొత్త నిబంధన

డొమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులకు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. నిర్ణీత రిటైల్ ధర వద్ద సబ్సిడీ సిలిండర్‌ను బుక్ చేయాలంటే వినియోగదారులు ఇకపై బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్‌(బీఏఏ)ను పూర్తిచేయాల్సి ఉంటుంది. అర్హులైన వినియోగదారులకే సబ్సిడీ సిలిండర్ అందజేసేందుకు ఈ ప్రక్రియను చేపట్టినట్టు చమురు సంస్థలు చెబుతున్నాయి. బీఏఏను పూర్తిచేసిన వినియోగదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని తెలిపాయి. వినియోగదారులు బీఏఏను పలు మార్గాల్లో పూర్తి చేయవచ్చు. సిలిండర్ డెలివరీ సమయంలో, డెలివరీ బాయ్ ఓఎంసీ మొబైల్ యాప్ ద్వారా అక్కడికక్కడే బీఏఏ చేయవచ్చు. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీ కేంద్రానికి స్వయంగా వెళ్లి అందించవచ్చు. బీఏఏ పూర్తిచేయని సందర్భంలో వినియోగదారులకు మార్కెట్ ధరకు సిలిండర్ సరఫరా అవుతుంది.