ముంబై: శిశు ఆహార ఉత్పత్తులు, పాల ప్రత్యామ్నాయాల తయారీ, విక్రయం, ప్రచారాలపై మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన విభాగం (ఎఫ్‌డీఏ) తీవ్ర ఆంక్షలు విధించింది. తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి తెచ్చే పౌడర్లు, ఫార్ములా ఆహారాల ప్రచారాలను పూర్తిగా నిషేధిస్తూ రాష్ట్రవ్యాప్త ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార భద్రత కమిషనర్ తుకారాం ముండే ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం-2006’ సెక్షన్ 30 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేశారు. తయారీదారులు, దిగుమతిదారులు, ఆసుపత్రుల సరఫరాదారులు, విక్రేతలు, ఈ-కామర్స్ సంస్థల వరకు సప్లై చైన్‌లోని ప్రతి ఒక్కరికీ ఈ నిబంధనలు తక్షణమే వర్తిస్తాయి.
లేబుల్‌పై హెచ్చరిక తప్పనిసరి
శిశు ఉత్పత్తుల ప్యాకెట్ల ముందుభాగంలో "ముఖ్య గమనిక – బిడ్డకు తల్లిపాలే శ్రేష్ఠం" అనే వాక్యాన్ని ప్రముఖంగా ముద్రించాలని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. ప్యాకెట్లపై చిన్నారులు, మహిళల చిత్రాలు ముద్రించడం నేరమని తేల్చిచెప్పింది. 'సంపూర్ణ ఆహారం', 'హెల్త్ మిక్స్', 'బేబీ సిరియల్' లాంటి తప్పుదోవ పట్టించే పదాలతో వ్యాపారం సాగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. ఆరు నెలల తర్వాతే అనుబంధ ఆహారాలు ఇవ్వాలన్న నిబంధనను కచ్చితంగా లేబుల్ పై చేర్చాలని ఆదేశించింది.
ఆరోగ్య సమస్యల దృష్ట్యా నిర్ణయం
చిన్న వయసులోనే పిల్లల్లో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుండటంపై ఎఫ్‌డీఏ ఆందోళన వ్యక్తం చేసింది. పదేళ్ల పైబడిన వారిలో 35 శాతానికి పైగా రక్తపోటు, 12 శాతానికి పైగా ప్రీ-డయాబెటిస్ లక్షణాలు బయటపడటానికి అసమతుల్య ఆహారపు అలవాట్లే కారణమని సర్వే వివరాలను అధికారులు ప్రస్తావించారు. పుట్టిన బిడ్డకు గంటలోపు 55 శాతం మంది తల్లులు మాత్రమే పాలిస్తున్నారని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే ప్రచారాలపై కఠిన వైఖరి తీసుకున్నామని వివరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.