arresting ex cm Mamata Banerjee, Arvind Kejriwal 
జాతీయ వార్తలు

మమతా, కేజ్రీవాల్ అరెస్ట్

* జంతర్ మంతర్‌కు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు * మాజీ సీఎంలు, విద్యార్థి నాయకులు అరెస్ట్

S. Pavan

న్యూఢిల్లీ, అక్టోబర్ 10 : విపక్షాల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ అంతటా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. సీజేపీ, విపక్షాలు తలపెట్టిన నిరసనలపై ఢిల్లీ పోలీసు ఉక్కుపాదం మోపుతున్నది. శనివారం జంతర్ మంతర్ వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ మాజీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయ్ విజయన్, మాణిక్ సర్కార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. పలువురు ప్రతిపక్ష, విద్యార్థి నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ సహా ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలను సౌత్ అవెన్యూ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మమతా బెనర్జీ అక్కడే బస్టాప్‌లో కూర్చొని నిరసన తెలిపారు. తృణమూల్ ఎంపీలతో కలిసి ఆమెను పోలీసు బస్సులో తరలించారు. అనంతరం వారిని విడుదల చేయగా, మమత విలేకర్లతో మాట్లాడుతూ ‘ప్రజల గొంతును బలపరిచేందుకు ఇండియా కూటమి పోరాటం సాగిస్తుంది’ అని అన్నారు. శనివారం ఉదయం నుంచే ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ నివాసం వద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు. ఇంటి నుంచి బయటకు రాగానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దేశ యువత భయపడదని, ఓట్ల అక్రమాలపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు. ప్రతి ఒక్కరూ నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్‌కు బయల్దేరిన కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టస్, కేరళ మాజీ మంత్రి కేఎన్ బాలగోపాల్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని ఢిల్లీలో పౌర హక్కులు లేవని సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టస్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనల్లో పాల్లొనేందుకు వచ్చిన వామపక్ష నాయకుల్ని పోలీసులు నిర్బంధించారు. త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్‌ను కూడా నిరసన సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు.