Mumbai man arrested for posting videos related to Jaish-e-Mohammed 
జాతీయ వార్తలు

ముంబైలో లోన్ ఊల్ఫ్ అరెస్ట్

ముంబైలో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్‌కు సంబంధించిన వీడియోలు, రెచ్చగొట్టే పోస్టులు ప్రచారం చేసిన ఆరోపణలపై ఓ బైక్‌ టాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Srinivas Rao

ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరంలో ‘జైషే’ ఉగ్రవాద సంస్థ అధినేతకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ముంబైలోని మహిమ్ ప్రాంతానికి చెందిన బైక్ టాక్సీ డ్రైవర్‌ (32) కు విదేశీ ఉగ్రవాద నెట్‌వర్క్‌తో ఎలాంటి సంబంధాలు లేవని, ఒంటరిగానే ఈ చర్యలకు పాల్పడ్డాడని దర్యాప్తులో తేలింది. ఇలాంటి వారిని లోన్ ఊల్ఫ్‌లని అంటారు. ఈ అంశంపై పోలీసు వర్గాలు స్పందిస్తూ, "నిందితుడు సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే సందేశాలు పంపుతూ ప్రజలలో ఉద్రిక్తతలు సృష్టించడానికి ప్రయత్నించాడు" అని వెల్లడించారు.

ఉగ్రవాద కంటెంట్ ప్రచారం

నిందితుడి వద్ద లభించిన మొబైల్ ఫోన్‌ పరిశీలించగా ఉగ్రవాద కంటెంట్ వెలుగులోకి వచ్చింది. నిందితుడు మొబైల్ ఫోన్ ద్వారా వివిధ గ్రూపులు సృష్టించి రెచ్చగొట్టే పోస్టులు పంచుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన పోస్టుల కింద అభ్యంతరకర వ్యాఖ్యలు రాశాడు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజర్‌కు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్ వేదికగా ప్రచారం చేశాడు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించేలా పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేసినందుకు భారతీయన్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.