Nobel Prize In Economics 2026 Awarded To Robert E Hall And Michael Woodford 
జాతీయ వార్తలు

ఇద్దరు అమెరికా ప్రొఫెసర్లకు ‘ఆర్థిక నోబెల్’

ఆర్థిక సంక్షోభాలు, ఇంధన ధరల పెరుగుదల, ప్రజల వినియోగంలో ఆకస్మిక మార్పుల ప్రభావాన్ని ఎలా తగ్గించాలి? వంటి అంశాలను అర్థం చేసుకోవడానికి వీరి పరిశోధనలు దోహదపడతాయి.

S. Pavan

స్టాక్‌హోమ్, అక్టోబర్ 12: సంక్షోభ సమయాన దేశాలు, బ్యాంకులు అనుసరించాల్సిన ‘స్థిరమైన’ ఆర్థిక నమూనాలను రూపొందించటంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు అమెరికా ఆర్థికవేత్తలను 2026 ఆర్థిక నోబెల్ వరించింది. స్టాన్‌ఫోర్డ్, కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న రాబర్ట్ ఈ. హాల్, మైఖేల్ వుడ్‌ఫోర్డ్ ఈ ఏడాది ఆర్థిక శాస్ర్తంలో నోబెల్ పురస్కరానికి ఎంపికయ్యారు. స్వీడన్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ఈ అవార్డును ప్రకటించింది. సరైన సమయంలో ద్రవ్య, ఆర్థిక విధానాలను అమలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో వచ్చే తీవ్ర హెచ్చుతగ్గులను తగ్గించవచ్చని వీరి పరిశోధనలు సూచిస్తున్నాయి. ‘ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ఉపయోగిస్తున్న ఆర్థిక నమూనాలకు వీరి నమూనాలు బలమైన సైద్ధాంతిక పునాదిని అందించాయి. ఇంధన సంక్షోభాలు, గృహ వినియోగంలో ఆకస్మిక మార్పులు వంటి ఆర్థిక దెబ్బలను ఎదుర్కోవడంలో ఇవి మనకు మరింత సహాయపడుతున్నాయి’ అని ఆర్థిక శాస్త్ర నోబెల్ కమిటీ చైర్మన్ జాన్ హాస్లర్ తెలిపారు. ఆర్థిక సంక్షోభాలు, ఇంధన ధరల పెరుగుదల, ప్రజల వినియోగంలో ఒక్కసారిగా వచ్చే మార్పుల ప్రభావాన్ని ఎలా తగ్గించాలి? వంటి అంశాలను అర్థం చేసుకోవడానికి వీరి పరిశోధనలు దోహదపడతాయి. వీరిద్దరూ అభివృద్ధి చేసిన సరికొత్త ‘సూక్ష్మ ఆర్థిక విధానాలు’ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు, ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులకు మెరుగైన మార్గదర్శకత్వాన్ని అందించాయి. డిసెంబర్ 10న విజేతలకు పురస్కారాన్ని అందజేయనున్నారు. నోబెల్ పురస్కారం కింద 12 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు (సుమారు రూ.11.48 కోట్లు) నగదు బహుమతిగా లభించనుంది. దీంతో 2026 ఏడాదికిగాను నోబెల్ అవార్డుల ప్రకటనలు పూర్తయ్యాయి. వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి రంగాల్లోని అవార్డులను ఇప్పటికే ప్రకటించారు.