ప్రభాత ఉదయం, న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్‌యూఐ) న్యూఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం భారీ ఆందోళన చేపట్టింది. జంతర్ మంతర్ సమీపంలో ఉన్న కన్నాట్ ప్లేస్‌లోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ 7వ గేట్ వద్ద చేపట్టిన ఈ నిరసనలో జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ నిరసనలో పాల్గొన్న ఎన్ఎస్‌యూఐ వినోద్ జాఖర్ తోపాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
‘‘శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మమ్మల్ని బలవంతంగా అణచివేయాలని చూస్తున్నారు. అరెస్టులతో మా గొంతును ఆపలేరు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదు’’ అని వినోద్ జాఖర్ హెచ్చరించారు. ‘‘జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకపోతే ఓట్ల చోరీకి వ్యతిరేకంగా మా పోరాటం మరింత తీవ్రరూపం దాల్చుతుంది’’ అని ఎన్ఎస్‌యూఐ జాతీయ మీడియా ఇన్‌చార్జ్ రవి హనుమాన్ పాండే తెలిపారు. ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్‌ను డీనోటిఫై చేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.