భారత చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు భారతరత్న ఇవ్వాలని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎద్దేవా చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇటీవల వెలుగులోకి వచ్చిన ఎన్నికల కమిషన్ అంతర్గత రిపోర్టుల నేపథ్యంలో మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాలు ఊరికే ఆరోపణలు చేయడం లేదన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఓ పత్రికే బయటపెట్టిందని చెప్పారు. తమకు తెలియకుండానే ఎస్ఐఆర్ వ్యవహారాల్లో ఆదేశాలు వెలువడ్డాయని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్సింగ్ సంధు, వివేక్ జోషి పదినెలల్లో 14 సార్లు లిఖితపూర్వకంగా అభ్యంతరం తెలిపినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిందని వివరించారు. దీనిపై భారత ఎన్నికల కమిషన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వడంపై ఓ విలేకరి అడగ్గా.. ‘‘ కేవలం పద్మభూషణ్ మాత్రమేనా? ఆయనకు భారత్రత్న ఇవ్వాలి’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఇంకా రెండేళ్ల కాలం ఉంది, రాష్ట్రపతి హోదా కల్పించాలి. ఆయన బీజేపీకి చాలా లబ్ధి చేకూర్చారు. పశ్చిమ బెంగాల్‌ను బహుమతిగా ఇచ్చారు.’’ అన్నారు.
పశ్చిమ బెంగాల్లో శాంతియుతంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం, అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీయుల పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసినందుకు జ్ఞానేశ్ కుమార్‌కు కనీసం పద్మభూషణ్ పురస్కారమైనా దక్కాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ శమిక్ భట్టాచార్య ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
ఎస్ఐఆర్ ప్రక్రియ నేపథ్యంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లిఖితపూర్వకంగా అభ్యంతరం తెలిపినట్లు వచ్చిన వార్తలతో కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర వివాదం రాజుకుంది. ఈ క్రమంలో భట్టాచార్య చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి.
పశ్చిమ బెంగాల్ పానిహతిలో బెంగాల్ బీజేపీ చీఫ్ భట్టాచార్య గత శుక్రవారం మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించారు. గత ఎన్నికల్లో సామాన్యుల ఓటుహక్కును నాశనం చేశారంటూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌లను దేశద్రోహులుగా పేర్కొనడాన్ని కొట్టిపారేశారు.
బెంగాల్లో పోలింగ్ సమయంలో ఎలాంటి హత్యలు చోటుచేసుకోలేదని, చాలా కాలం తర్వాత బెదిరింపులకు అడ్డుకట్ట పడిందన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని, అందుకు బెంగాల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.