జాతీయ వార్తలు

తెలంగాణ గడ్డపైనే భారత జాతీయ పతాక రూపకల్పన..!

Agasthya kantu

కోట్లాది మంది భారతీయుల గుండెల్లో దేశభక్తి భావనను రగిలిస్తూ, సమైక్యతా స్ఫూర్తితో నింగికెగసే మన త్రివర్ణ పతాకం భారతజాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ప్రతీకగా రెపరెపలాడే ఈ మువ్వన్నెల జెండాను చూడగానే ప్రతి భారతీయుడి నరనరాల్లోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది. అయితే, ప్రపంచ వేదికలపై భారత సార్వభౌమాధికారాన్ని చాటిచెప్పే మన జాతీయ జెండా తొలి రూపకల్పన జరిగింది మన తెలంగాణ గడ్డపైనే అన్న సత్యం చాలామందికి తెలియదు! స్వాతంత్ర్య ఉద్యమానికి దిశా నిర్దేశం చేసి, నేడు కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్న జాతీయ పతాకం తెలంగాణ నేలపైనే పురుడుపోసుకోవడం మనందరికీ అనంతమైన గర్వకారణం. మువ్వన్నెల జెండా ఆవిర్భావం వెనుక దాగిన ఈ ఆసక్తికర చరిత్ర ఏంటో తెలుసుకుందాం..

భారత జాతీయ పతాకం మువ్వన్నెల జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు అనే విషయం చాలా మందికి తెలుసు. జాతీయ పతాకం రూపొందించడం వెనుక మేధోమధనం, ఆలోచనలలకు తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం కోటతో  ప్రత్యేక అనుబంధం ఉంది. నడిగూడెం రాజా వారి కోటలో జమిందారు రాజనాయిని వెంకటరంగరావు జమానాలో 1909 నుంచి 1929 వరకు  వ్యవసాయ అధికారిగా పని చేసిన పింగళి వెంకయ్య ఈ కోటలోనే జాతీయ జెండా రూపొందించారు. ఆ విధంగా జాతీయ జెండాలో రూపకల్పనలో తెలంగాణ భాగమైంది.

భౌగోళిక శాస్త్రవేత్త.. భాషావేత్త.. వ్యవసాయ పరిశోధకుడు

భారత జాతీయ పతాకం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే వ్యక్తి పింగళి వెంకయ్య. 1876 ఆగస్ట్ 2న కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో జన్మించారు. ప్రాథమిక విద్యను మచిలీపట్నంలో పూర్తి చేశారు. ఆయన కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాక భౌగోళిక శాస్త్రవేత్త, భాషావేత్త, వ్యవసాయ పరిశోధకుడు. ఆయనకు జపనీస్ భాషతో సహా పలు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉండటంతో "జపాన్ వెంకయ్య" అని కూడా పిలిచేవారు.  1904-05 రష్యా-జపాన్ యుద్ధం సమయంలో జపాన్ విజయం ఆయనను ఆకర్షించడంతో, లాహోర్‌లోని దయానంద్ ఆంగ్లో-వేదిక్ (DAV) కళాశాలలో ప్రొఫెసర్ గోటే వద్ద జపనీస్ భాషను నేర్చుకున్నారు. 1913లో బాపట్లలో జరిగిన ఒక బహిరంగ సభలో జపనీస్ భాషలో సుదీర్ఘంగా ప్రసంగించడంతో ఆయనకు "జపాన్ వెంకయ్య" అనే పేరు స్థిరపడింది.

దక్షిణాఫ్రికాలో..గాంధీతో పరిచయం

19 ఏళ్ల పిన్న వయస్సులోనే బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీలో చేరిన ఆయన దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్‌ యుద్ధ సమయంలో పని చేశారు. అక్కడే మహాత్మా గాంధీని కలిశారు. ఆ పరిచయం తర్వాతి కాలంలో ఆయన జీవితాన్ని, జాతీయోద్యమ ప్రయాణాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. ఆయనకు పతాకాలపై ఆసక్తి కూడా ఒక్కరోజులో పుట్టింది కాదు. బ్రిటిష్‌ జెండా కింద భారతీయులు పనిచేస్తున్న పరిస్థితి, అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు అవసరం, కాంగ్రెస్‌ సమావేశాల్లో స్వదేశీ జెండా ఉండాలనే ఆలోచన..ఇవన్నీ కలసి ఒక ప్రత్యేక భారత జాతీయ పతాకం అవసరమనే భావనను ఆయనలో బలపరిచాయి. 1906 కలకత్తా కాంగ్రెస్‌ సమావేశం తర్వాత ఈ ఆలోచన మరింత బలపడింది.

నడిగూడెం కోటకు ఎలా వచ్చారు?

పింగళి వెంకయ్య జీవితంలో నడిగూడెం ఒక కీలక అధ్యాయం. నేటి సూర్యాపేట జిల్లా నడిగూడెం అప్పట్లో మునగాల సంస్థాన పరిధిలో ఉండేది. సంస్థానాధిపతి రాజా నాయిని వెంకటరంగారావు. 1900లో మునగాల సంస్థాన బాధ్యతలు స్వీకరించారు. 1906లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో (దాదాభాయి నౌరోజీ అధ్యక్షతన జరిగిన సభ) పింగళి వెంకయ్యను నాయిని వెంకటరంగారావు తొలిసారిగా కలిశారు. వెంకయ్య దేశభక్తి, బహుముఖ ప్రజ్ఞ, వ్యవసాయ రంగంపై ఆయనకున్న విస్తృత జ్ఞానాన్ని చూసి ప్రభావితులైన మునగాల రాజావ, ఆయనను తన ఆస్థానానికి (నడిగూడెం) ఆహ్వానించారు. దీంతో 1909 నుంచి 1929 వరకు ఆ సంస్థానంలో వ్యవసాయాధికారిగా పని చేశారు. ముఖ్యంగా పత్తి సాగులో కొత్త పద్ధతులు, కొత్త వంగడాలపై ప్రయోగాలు చేస్తూ రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించారు. అలా వ్యవసాయ పరిశోధనల కోసం వచ్చిన నడిగూడెం.. క్రమంగా ఆయన జాతీయోద్యమ ఆలోచనలకు కూడా ఒక వేదికగా మారింది.

పతాకం రూపొందించాలనే ఆలోచన

పింగళి వెంకయ్యలో జాతీయ పతాకం ఆలోచనకు పలు అనుభవాలు కారణమయ్యాయి. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్‌ సైన్యంలో పని చేసినప్పుడు భారతీయ సైనికులు బ్రిటిష్‌ జెండాకు సెల్యూట్‌ చేయాల్సిన పరిస్థితిని ఆయన చూశారు. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ సైనికులు తమ ‘యూనియన్ జాక్’ జెండాను చూసి పొందే గర్వాన్ని గమనించిన వెంకయ్య, భారతీయులకు కూడా ఒక ఐక్యతా చిహ్నం కావాలని భావించారు. కాంగ్రెస్ సమావేశాలలో బ్రిటిష్ జెండా కిందే భారతీయులు సమావేశం కావడం ఆయనను తీవ్రంగా ఆలోచింపజేసింది. భారతీయులకు తమదైన జాతీయ గుర్తింపు ఉండాలనే ఆలోచన అప్పుడే ఆయనలో బలపడింది.

నడిగూడెం కోటలోనే తొలి రూపం

1906లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశానికి హాజరైనప్పుడు భారతీయుల కోసం ప్రత్యేక జెండా అవసరమనే భావన ఆయనలో మరింత బలపడింది. భారతదేశానికి ప్రత్యేకమైన జాతీయ పతాకం ఉండాలనే ఆలోచనతో పింగళి వెంకయ్య 1913 నుంచి వివిధ నమూనాలపై కసరత్తు ప్రారంభించారు.  నడిగూడెం కోటలోని తన గదిలోనే ఉంటూ ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30కి పైగా దేశాల జెండాలను అధ్యయనం చేశారు. 1916 సంవత్సరంలో "భారతదేశానికొక జాతీయ జెండా" అనే పుస్తకాన్ని ఆంగ్ల భాషలో రచించారు. నడిగూడెం కోటలోనే ఎరుపు, ఆకుపచ్చ రంగుల పట్టీలతో తొలి నమూనాను సిద్ధం చేశారు.1916లో లక్నోలో, 1919లో జలంధర్‌లో నమూనా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. నడిగూడెం కోటలో రూపొందించిన ఈ నమూనాను 1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో మహాత్మా గాంధీకి సమర్పించారు. గాంధీజీ సూచన మేరకు ఇతర మతాల సమైక్యతకు, శాంతికి సంకేతంగా తెలుపు రంగును, స్వదేశీ ఉద్యమం, నూలు వడికే ఆర్థిక స్వావలంబనకు ప్రతీకగా రాట్నం (చరఖా) చిహ్నాన్ని చేర్చారు. ఈ జెండాను గాంధీజీ, కాంగ్రెస్ కమిటీ ఆమోదించాయి. 1909-1929 మధ్య కాలంలో వెంకయ్య గీసిన జాతీయ జెండా నమూనాలు, వ్యవసాయ రికార్డులు రాసిన టేబుల్, కుర్చీ, వాడిన ఫౌంటెన్ పెన్నులు, ఇంకు సీసాలు నేటికీ కోట ప్రాంగణంలో చెక్కుచెదరకుండా భద్రంగా ఉన్నాయి.

రాట్నం నుంచి అశోకచక్రం వరకు..

1921లో ఆమోదించిన నమూనాకు 1931లో మార్పు చేశారు. ఎరుపు స్థానంలో కాషాయం రంగును చేర్చాచు. తర్వాత స్వాతంత్ర్యానికి ముందు జాతీయ పతాకాన్ని ఖరారు చేసే సమయంలో రాట్నం స్థానంలో అశోక ధర్మచక్రాన్ని చేర్చి 1947 జూలై 22న రాజ్యాంగ సభ ప్రస్తుత త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో 24 ఆకుల నీలి అశోకచక్రం ఉన్న రూపమే నేటి భారత జాతీయ పతాకం.

పతాక శిల్పి మాత్రమే కాదు.. ‘పత్తి వెంకయ్య’ కూడా!

పింగళి వెంకయ్య పేరు సాధారణంగా జాతీయ పతాకంతోనే ముడిపడిపోయింది. కానీ ఆయనలో మరో గొప్ప వ్యవసాయ పరిశోధకుడు. ప్రత్యేకంగా పత్తి పంటపై ఆయనకు అపారమైన ఆసక్తి. నడిగూడెంలో పనిచేస్తున్న సమయంలో కొత్త పత్తి వంగడాలపై ప్రయోగాలు చేసి, రైతులకు ఆధునిక సాగు పద్ధతులను పరిచయం చేశారు. కంబోడియా పత్తి రకంపై ఆయన చేసిన పరిశోధన ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. అందుకే ఆయనకు ‘పత్తి వెంకయ్య’ అనే పేరు వచ్చింది. వెంకయ్య   కేవలం పత్తి విత్తనాల పరిశోధనకే పరిమితం కాలేదు..రైతులను సంప్రదాయ సాగు నుంచి ఆధునిక పద్ధతుల వైపు తీసుకెళ్లడం, పంటలపై శాస్త్రీయ అవగాహన పెంచడం, కొత్త వంగడాలను పరిచయం చేయడం ఆయన ప్రధాన లక్ష్యాల్లో ఉండేవి.  భూగర్భశాస్త్రంపై ఆసక్తితో ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చదివి జియాలజీలో డిప్లొమా పొందారు. అనంతరం నెల్లూరు ప్రాంతంలో మైకా, వజ్రాలపై పరిశోధనలు చేశారు. ముఖ్యంగా వజ్రకరూరు, హంపి ప్రాంతాల్లో వజ్రాల లభ్యత, వాటి భౌగోళిక మూలాలపై అధ్యయనం చేశారు. దాంతో ‘డైమండ్ వెంకయ్య’ లేదా ‘వజ్రాల వెంకయ్య’ అనే పేరుతో కూడా పిలిచే వారు.