న్యూఢిల్లీ : సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. అరెస్టు అనంతరం వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపటాన్ని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. జంతర్ మంతర్‌లో నిరసనకు దిగిన సీజేపీ నేతలకు రాహుల్‌గాంధీ మద్దతు పలికారు. నిరసన ప్రదేశంగా జంతర్‌మంతర్‌ను తొలగించిన తర్వాత అక్కడ ఆందోళనకు దిగారన్న ఆరోపణలపై అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోగా, అనంతరం కోర్టు వారికి 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ సహా వివిధ పార్టీల నేతలు వారి అరెస్టును ఖండిస్తూ, సీజేపీ నిరసనకు మద్దతు ప్రకటించారు. రాహుల్‌గాంధీ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ‘జంతర్‌మంతర్‌లో శాంతియుతంగా నిరసన చేస్తూ త్రివర్ణ పతాకాన్ని ఊపడం నేరం కాదు. అందుకు యువతను జైలుకు పంపడం పిరికిపందల చర్య’ అని మండిపడ్డారు. తమకు మద్దతుగా నిలబడినందుకు రాహుల్‌గాంధీకి సీజేపీ నాయకుడు అభిజీత్ దీప్కే ధన్యవాదాలు తెలిపారు. సీజేపీ నేతలకు ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా మద్దతు తెలిపారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సీజేపీ నేతల అరెస్టును ఖండించారు. ‘మన దేశంలో జాతీయ జెండాను ఊపడం నేరమా? ఇది పూర్తిగా హాస్యాస్పదం’ అని పేర్కొన్నారు. తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ, జాతీయవాదులుగా చెప్పుకునేవాళ్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన భారతీయులను అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. డీఎంకే చీఫ్ స్టాలిన్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే సీజేపీ నేతల అరెస్టును ఖండించారు.
‘పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు’
నిరసనలవేళ విద్యార్థులు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టడాన్ని రాహుల్‌గాంధీ ఖండించారు. సీఈసీ కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలంటూ మంగళవారం శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థుల పట్ల ఢిల్లీ పోలీసులు అమానుషంగా వ్యవహరించారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. బుధవారం విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ వర్సిటీలో చదువుతున్న అధిరా అనే విద్యార్థిని పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిందని, ఈ అమ్మాయికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని రాహుల్‌గాంధీ నిలదీశారు. గత నిరసనల్లో ఒక అబ్బాయి కళ్లు కోల్పోతే, ఈ సారి ఓ అమ్మాయి వినికిడి శక్తి కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.