జాతీయ వార్తలు

విద్యావ్యవస్థపై మోదీ దాడి

సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ధ్వజం

Srinivas Rao

ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక వ్యతిరేకి అని, ఆయన పాలన మొత్తం విద్యను ద్వేషిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులు ఆలోచించడం, ప్రశ్నలు అడగడం మోదీకి ఏమాత్రం ఇష్టం ఉండదని ఆరోపించారు. పలు విద్యాసంస్థల్లో పాఠ్యాంశాలుగా ఉన్న మేధావులు, విద్యావేత్తల రచనలను ఉన్నత విద్యాశాఖ పునఃపరిశీలిస్తోందంటూ వచ్చిన మీడియా కథనాలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన ‘కుల నిర్మూలన’, జ్యోతిబా ఫులే రచన ‘గులాంగిరి’ పుస్తకాలు విషం చిమ్ముతున్నాయంటూ వచ్చిన ఓ అనామక పోస్టు ఆధారంగా ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవడం దారుణమని మండిపడ్డారు.

ట్రోల్స్‌పై స్పందన.. సమస్యలపై మౌనం

ఓ గుర్తుతెలియని పోస్టు వచ్చిన మరుసటి రోజే ప్రధాని కార్యాలయం ఆదేశాలు జారీ చేయడంపై రాహుల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లోని సిలబస్, అక్కడ చదువుతున్న విద్యార్థుల వివరాలను కేంద్ర విద్యాశాఖ వెంటనే కోరడం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. దేశంలో నిత్యం జరుగుతున్న పేపర్ లీకేజీలు, పెరుగుతున్న నిరుద్యోగం, యువత భద్రత లాంటి కీలక అంశాలపై నోరు మెదపని ప్రధాని, ఆన్‌లైన్ ట్రోల్స్‌కు అత్యంత వేగంగా స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు.