న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల అసలైన పోరాటం సీఈసీపై మాత్రమే కాదని, ఆయన వెనుకనున్న పెద్దశక్తులపైనే అని స్పష్టం చేశారు. జ్ఞానేశ్ కుమార్ సీఈసీ హోదాలో తప్పు చేశారని, కానీ ఆ తప్పు వెనుకనున్న ఆలోచన జ్ఞానేశ్ది కాదన్నారు. ‘‘సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదని మాకు తెలుసు. ఆయనకు నేను నేరుగా చెప్పేది ఒక్కటే.. ఇక మీరు సీఈసీగా కొనసాగలేరు. మోదీ ప్రభుత్వంలోని 200 మంది అధికారులు మాతో టచ్‌లో ఉన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు” అని రాహుల్ గాంధీ వెల్లడించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నిరసనలు కొనసాగి తీరుతాయి
‘‘గతంలోనూ మోదీ సర్కారుపై వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ అది ఇలాంటి నిరసనల రూపంలో వీధికెక్కలేదు. ఈసారి జరుగుతున్న పోరు ఆగబోదు. ఎన్ని రోజులైనా, ఎన్నేళ్లైనా ఈ నిరసన పథం కొనసాగి తీరుతుంది. ఒక్క రోజులోనో, రెండు రోజుల్లోనో దేశాన్ని కాపాడలేం. ఇందుకోసం ప్రజలంతా పట్టుదలతో ముందుకుసాగాలి” అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘ఈ ప్రజా నిరసనలు శివతాండవం లాంటివి. ఎవరైనా సరే శివుడి బారాత్ (పెళ్లి ఊరేగింపు)లో భాగం కావచ్చు”అని ఆయన పిలుపునిచ్చారు.
సుప్రీంకోర్టుకు విపక్షం మార్చ్
విపక్ష ఇండియా కూటమి నేతలు సోమవారం మధ్యాహ్నం ‘చలో ఢిల్లీ – మార్చ్ ఫర్ డెమొక్రసీ’ పేరుతో సుప్రీంకోర్టు దిశగా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపిస్తూ.. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో 300 మందికిపైగా విపక్ష ఎంపీలు, వేలాది మంది రాజకీయ కార్యకర్తలు, పౌర సమాజ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ర్యాలీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, శివసేన (ఉద్ధవ్) నాయకుడు సంజయ్ రౌత్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు సౌగతా రాయ్, సాగరికా ఘోష్, సీపీఐ నేత డి.రాజా, సీపీఎం నాయకుడు ఎంఏ బేబీ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నేత దీపాంకర్ భట్టాచార్య, జేఎంఎం నేత మహువా మాఝీ, కాంగ్రెస్ ఎంపీలు శశి థరూర్, సచిన్ పైలట్, ముకుల్ వాస్నిక్, పౌర హక్కుల కార్యకర్త యోగేంద్ర యాదవ్, ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా తదితరులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.
బారికేడ్లు ఎక్కి మరీ రాహుల్ నిరసన
తొలుత ఈ నిరసనకారులంతా ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకా గాంధీతో పాటు మిగతా విపక్ష నేతలంతా కలిసి సాధారణ ఎయిర్ కండిషన్డ్ బస్సుల్లో ర్యాలీ ప్రారంభ కేంద్రమైన కన్నాట్ ప్లేస్ - బారాఖంబా రోడ్ జంక్షన్‌కు చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మార్చ్ మొదలైంది. నాయకులు శాంతియుతంగా మార్చ్ చేస్తుండగా మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో సుప్రీంకోర్టుకు అత్యంత సమీపంలోని మండి హౌస్, భగవాన్ దాస్ రోడ్ సమీపంలో పోలీసులు నాలుగు అంచెల బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు అక్కడే బారికేడ్లు ఎక్కి నిరసన తెలిపారు. ‘‘ఇది కేవలం ఒక రాజకీయ నిరసన కాదు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడటానికి చేస్తున్న పవిత్రమైన పోరాటం” అని ఈసందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భగవాన్ దాస్ రోడ్ సమీపంలో నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో దాదాపు ఒక గంట పాటు (సాయంత్రం 3:30 గంటల వరకు) ఉద్రిక్తత కొనసాగింది. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో, ఆయన నిర్ణీత సమయానికి (సాయంత్రం 4:30 గంటల కల్లా) కోర్టుకు చేరుకోలేకపోయారు. మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఢిల్లీ హైకోర్టు న్యాయవాదులు కోర్టు లాన్‌లో సమావేశమై భారత రాజ్యాంగ పీఠికను బిగ్గరగా చదివి నిరసన వ్యక్తం చేశారు.
పిటిషన్ దాఖలు చేసిన విపక్ష లీగల్ టీమ్
ఈ పరిస్థితుల్లో విపక్షాల లీగల్ టీమ్ సుప్రీంకోర్టు ఫైలింగ్ కౌంటర్‌లో పిటిషన్‌ను అధికారికంగా దాఖలు చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ విపక్ష నేతలతో పరిపాలనాపరమైన సమావేశానికి నిరాకరించారు. అయితే, విపక్ష కూటమికి చెందిన 10-15 మంది న్యాయవాదులు, విపక్ష ప్రతినిధుల బృందాన్ని సుప్రీంకోర్టు లోపలికి అనుమతించారు. హై-సెక్యూరిటీ జోన్ వెలుపల ఉన్న ఫైలింగ్ కౌంటర్ వద్ద తమ అధికారిక పిటిషన్‌ను దాఖలు చేసేందుకు కోర్టు రిజిస్ట్రీ అనుమతి ఇచ్చింది. అడ్వకేట్-ఆన్-రికార్డ్ (ఏఓఆర్) ఎస్. ప్రసన్న ద్వారా ఈ రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వెబ్సైట్లో నమోదు చేశారు. దీనికి డైరీ నంబర్ 64196/2026 గా కేటాయించారు. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలను ప్రతివాదులుగా చేర్చారు.
అక్టోబరు 13న విచారణ
విపక్ష ఇండియా కూటమి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం (అక్టోబరు 13న) దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రాథమిక విచారణ జరగనుంది. ఇది జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, ఫారమ్-6 మార్పులు, సీఈసీ జ్ఞానేశ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇప్పటికే కోర్టులో దాఖలైన ఇతర అనుబంధ పిటిషన్లు ఉన్నాయి. ఇండియా కూటమి తాజా పిటిషన్‌ను కూడా మంగళవారం రోజు ప్రాథమిక విచారణ అనంతరం పాత పిటిషన్లతో కలిపి అక్టోబరు 27న పూర్తిస్థాయి విచారణ జరపాలని చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ ధర్మాసనం నిర్ణయించింది.
పిటిషన్‌లో ఏముంది ?
ఇందులో పిటిషనర్లుగా మొత్తం 11 మంది నేతలు ఉన్నారు. రాహుల్ గాంధీ(కాంగ్రెస్), మల్లికార్జున ఖర్గే(కాంగ్రెస్), అఖిలేష్ యాదవ్(సమాజ్‌వాదీ), సౌగతా రాయ్(టీఎంసీ), తేజస్వీ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), సంజయ్ రౌత్ (శివసేన ఉద్ధవ్), ఎం.ఏ. బేబీ (సీపీఐ - ఎం), డి. రాజా (సీపీఐ), సుప్రియా సూలే (ఎన్‌సీపీ - శరద్ పవార్), మహువా మాఝీ (జార్ఖండ్ ముక్తి మోర్చా), ఈ.టి. మహమ్మద్ బషీర్ (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్) ఇందులో పిటిషనర్లుగా ఉన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో ఇండియా కూటమి దాఖలు చేసిన పిటిషన్‌లో పలు ప్రధాన డిమాండ్లు, ఆరోపణలు ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే 'ఫామ్-6' నిబంధనలను ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా మార్చేశారని ఆరోపించారు. ఈ వివాదాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
ఢిల్లీలో హైఅలర్ట్
ఈ భారీ మార్చ్ నేపథ్యంలో సోమవారం ఉదయం ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రత దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మధ్యాహ్నం వరకు కీలకమైన 6 మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసింది. బారాఖంబా, మండి హౌస్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ట్రాఫిక్ ఆంక్షలు, మెట్రో స్టేషన్ల మూసివేత ఉదయం 6:00 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.
అంతకుముందు రోజు (అక్టోబర్ 11న) రాహుల్ గాంధీ, ఖర్గే కలిసి స్వయంగా ఒక మెమోరాండం సమర్పించడానికి సీజేఐ సూర్య కాంత్‌ను అపాయింట్‌మెంట్ కోరారు. అయితే, ఈ అంశాలు ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్నందున, పరిపాలనాపరంగా కలవడం కుదరదని, న్యాయపరంగా పిటిషన్ వేసుకోవచ్చని సీజేఐ సూచించారు. దీంతో సోమవారం వారు నేరుగా కోర్టు కౌంటర్‌లో పిటిషన్ వేశారు.