న్యూఢిల్లీ: భారత్‌లో ప్రతి వ్యాపార సంస్థ పోటీ పడేందుకు సమాన అవకాశాలు కల్పించాలని, బంధుప్రీతి పెట్టుబడిదారీ విధానం సంకెళ్లను తెంచేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. శాటిలైట్ ఇంటర్‌నెట్ సేవలైన స్టార్‌లింక్ చుట్టూ నెలకొన్న వివాదం నేపథ్యంలో అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్‌తో ‘ఎక్స్’లో గురువారం సంభాషించిన అనంతరం రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. మస్క్‌తో తన సంభాషణకు సంబంధించిన వీడియోను శుక్రవారం ఆయన తన వాట్సాప్ చానల్‌లో పంచుకొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీనే భారత్‌కు అసలైన అధిపతా? అంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలకు.. ‘భారత్‌కు స్వాగతం ఎలాన్, ఇక్కడ మరో వ్యక్తి గురించి తెలుసుకున్నాక మీరే ఆశ్చర్యపోతారు’ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ స్పందనకు మస్క్ కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం’ అని వ్యాఖ్యానించారు. ‘నేను వ్యాపారానికి వ్యతిరేకం కాదు.. గుత్తాధిపత్యానికి వ్యతిరేకం’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
భద్రతా నిబంధనలు తప్పనిసరి: కేంద్రం
స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అడ్డుకుంటున్నారంటూ మస్క్ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం గురువారం తీవ్రంగా ఖండించింది. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు లైసెన్స్ పొందే ప్రతి సంస్థ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. అవసరమైన భద్రతా పరిశీలనలు, స్పెక్ట్రమ్‌కు సంబంధించిన అనుమతులు పూర్తయ్యే వరకు ఈ సంస్థల్లో ఏదీ వాణిజ్య సేవలను ప్రారంభించలేవని పేర్కొంది.