టాటా గ్రూపు వివాదంపై స్పందించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 
జాతీయ వార్తలు

‘టాటా’ను నాశనం చేస్తున్నా మౌనం వీడరా?

టాటా గ్రూపులో విభేదాల నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షాపై రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు.

Boddupalli Naresh

న్యూఢిల్లీ: టాటా గ్రూపులో వివాదం వేళ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ‘ఎక్స్’ వేదికగా బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టాటా గ్రూపును ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా నేరపూరితంగా నాశనం చేస్తున్నారు. కానీ, దేశంలోని ఏ వ్యాపారవేత్తా దీని గురించి మాట్లాడేందుకు సాహసించడం లేదు. ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటారు? చివరకు మిమ్మల్ని వారి ఆధీనంలోకి తీసుకునే వరకు వేచి చూస్తారా? భారతీయ వ్యాపార రంగం వారి(మోదీ, అమిత్షా) ఆటవస్తువు కాదు. ఈ నేరాలకు న్యాయం జరిగేలా చూస్తాం’ అని రాహుల్‌ పేర్కొన్నారు. కాగా, టాటా గ్రూపు మాతృ సంస్థ టాటా సన్స్‌ బోర్డుకు, టాటా ట్రస్ట్స్ చైర్మన్‌ నోయెల్‌ టాటాకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ సెప్టెంబరులో టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పదవీకాలం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. సంస్థను స్టాక్‌ మార్కెట్లో నమోదు చేయాలనే దిశగానూ అడుగులు వేసింది. ఈ రెండు నిర్ణయాలపై నోయెల్‌ టాటా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వివాదాల నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.