తెల్లని శరీరం. దానిపై నల్లని చారలు. ప్రకృతి సృష్టించిన అద్భుతం ఈ పులి. అత్యంత అరుదుగా కనిపించే నీలికళ్ల తెల్లపులి ‘తేజస్’ దాదాపు 556 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత డెహ్రాడూన్‌లోని రాజాజీ నేషనల్ పార్క్‌కు చేరింది. ఉత్తరాఖండ్‌లో మొట్టమొదటి తెల్లపులిగా నిలిచింది. ‘పులుల మార్పిడి’ కార్యక్రమంలో భాగంగా గ్వాలియర్ జూ పార్క్ నుంచి డెహ్రడూన్‌కు దీనిని తరలించారు. తేజస్‌కు బదులుగా 5 ఏళ్ల రాయల్ బెంగాల్ టైగర్ ‘భోలా’ను గ్వాలియర్‌కు పంపారు. రెండు నగరాల్లోని జంతు ప్రదర్శనశాలలో వన్యప్రాణుల వైవిధ్యాన్ని పెంచటం, పులుల సంరక్షణ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా అధికారులు తెలిపారు.
డెహ్రడూన్‌కు చేరుకున్న ‘తేజస్’ తెల్లని శరీరం, ముదురు రంగు చారలు, ఆకట్టుకునే నీలి కళ్లతో ప్రత్యేకంగా కనిపిస్తున్నది. దీనిని చూడటానికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు, ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యే వరకు తేజస్‌ను సందర్శకులకు దూరంగా 20 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు.
‘కొత్త పరిసరాలకు అలవాటు పడేందుకు అది పరిసరాలను తీక్షణంగా గమనిస్తున్నది. గాలి వాసన చూస్తూ, ఎన్‌క్లోజర్‌లోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నది’ అని డెహ్రడూన్ జూ రేంజర్ దీక్షాభట్ చెప్పారు. తెల్ల పులి ప్రత్యేక జాతి కాదు. అరుదైన జన్యు మార్పు కారణంగా దాని శరీరం తెల్ల రంగులో కనిపిస్తుంది. బెంగాల్ టైగర్స్‌లో ఉండే సహజమైన రంగు మార్పు మాత్రమే. చాలా అరుదుగా కనిపించటంతో ప్రపంచవ్యాప్తంగా జూ పార్క్‌లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.