RBI Governor Sanjay Malhotra 
జాతీయ వార్తలు

ఆర్బీఐ రెపో రేటు 5.5 శాతానికి పెంపు

Ramana
  • పెరగనున్న బ్యాంకు వడ్డీ రేట్లు

  • గృహ, వాహన లోన్ల ఈఎంఐలపై ప్రభావం

  • తగ్గించే ప్రసక్తే లేదన్న ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా

  • పశ్చిమాసియాలో సంక్షోభమే కారణమని వెల్లడి

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెపో రేటును పెంచింది. 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.5 శాతానికి చేర్చింది. మూడ్రోజుల పాటు ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ రెపో రేటు పెంపునకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. అలాగే, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్‌లో ఉంచేందుకు గతం నుంచి కొనసాగుతున్న న్యూట్రల్‌ విధానాన్ని క్యాలిబ్రేటెడ్‌ టైటెనింగ్‌గా మార్చింది. భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరుగుతాయని,  లేదంటే ఉన్నవి ఉన్నట్టుగానే కొనసాగుతాయని మల్హోత్రా తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని  పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి బలంగా ఉందని అన్నారు. ద్రవ్యోల్బణం, ప‌శ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెపో రేటును పెంచాల్సి వ‌చ్చిందని ఆయన స్పష్టం చేశారు. అయితే, పెరిగిన రెపో రేటుకు అనుగుణంగా బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచితే గృహ, ఇతర రుణాల ఈఎంఐలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.8 శాతంగా ఉండొచ్చు
దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు గతేడాదితో పోలిస్తే అంత సానుకూలంగా లేవని సంజయ్‌ మల్హోత్రా అన్నారు. యుద్ధ పరిస్థితులు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం, దాని భవిష్యత్‌ అంచనాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. వచ్చే మూడు త్రైమాసికాల్లో కలిపి సీపీఐ ద్రవ్యోల్బణం సగటున 5.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

వృద్ధి అంచనా 7.1 శాతానికి పెంపు
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుదల, ప్రపంచ వాణిజ్యంలో అడ్డంకులు, ఇబ్బందికర ఆర్థిక పరిస్థితులు భారత వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉందని మల్హోత్రా తెలిపారు. అయినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాను 40 బేసిస్‌ పాయింట్లు పెంచి 7.1 శాతంగా నిర్ణయించినట్లు తెలిపారు. రెండో త్రైమాసికంలో 7.2 శాతం, మూడో త్రైమాసికంలో 6.9 శాతం, నాలుగో త్రైమాసికంలో 6.8 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందిందని మల్హోత్రా తెలిపారు. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు 12శాతానికి పెరగడం వృద్ధికి ప్రధానంగా దోహదం చేశాయని చెప్పారు. నికర ఎగుమతులు కూడా వృద్ధికి సానుకూలంగా తోడ్పడ్డాయని వివరించారు. అయితే, తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో వృద్ధి కొంత మందగించిందని చెప్పారు. వ్యయాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తయారీ రంగ కార్యకలాపాలు స్థిరంగా కొనసాగాయని, దేశీయ, విదేశీ డిమాండ్‌ పెరగడంతో సేవల రంగం కూడా విస్తృతంగా పుంజుకుందని వెల్లడించారు.

2023 ఫిబ్రవరి తర్వాత తొలిసారి పెంపు
ఆర్‌బీఐ చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. ఆ తర్వాత 2023-24లో రేటును యథాతథంగా కొనసాగించింది. 2025లో రేటు తగ్గింపు ప్రక్రియను ప్రారంభించింది. తాజాగా మరోసారి రెపో రేటు పెంపు నిర్ణయం తీసుకుంది.