న్యూఢిల్లీ: గత నెలలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. సెప్టెంబర్ నెలలో దేశీయ విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య 1.18 కోట్లకు పరిమితం కాగా అంతక్రితం ఏడాది 1.26 కోట్లుగా నమోదైంది. విమాన సర్వీసుల ట్రాఫిక్ 6.5 శాతం పడిపోయినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. విమానాల ఆలస్యమే ఇందుకు కారణమని డీజీసీఏ ఒక నివేదికలో తెలిపింది. సెప్టెంబర్ నెలలో స్పైస్‌జెట్ దేశీయ మార్కెట్ వాటా 1.2 శాతం నుంచి 0.6 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా 26.8 శాతానికి పెరిగింది. ఇండిగో మార్కెట్ వాటా 65.4 శాతానికి చేరుకోగా, ఆకాశ ఎయిర్ వాటా 5.6 శాతానికి చేరింది.
ఆలస్యం కారణంగా పరిహారం
ఇతర షెడ్యూల్డ్ విమానయాన సంస్థల పనితీరులో పెద్దగా మార్పులు కనిపించలేదు. సమయపాలన విషయంలో ఇండిగో సంస్థ 91.1 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆకాశ ఎయిర్ 90.8 శాతంతో తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. గత నెలలో విమానాలు ఆలస్యం కావడం వల్ల లక్షకు పైగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల అసౌకర్యాల కోసం విమాన సంస్థలు భారీగా పరిహారాలు చెల్లించాల్సి వచ్చిందని నివేదిక పేర్కొంది.