ప్రభుత్వ శాఖల్లోని వందల కోట్ల రూపాయల్ని దారిమళ్లించి..వాటితో జల్సాలు చేసిన ఓ ప్రైవేట్ బ్యాంక్ మాజీ మేనేజర్ బాగోతాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. హర్యానా, చండీగఢ్‌లో సంచలనం సృష్టించిన రూ.657 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు సాగించిన ప్రేమ వ్యవహారం, ఖరీదైన విందులు, వినోదాలు..వింటే మనం నోరెళ్లబెట్టాల్సిందే. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సీబీఐ కీలక విషయాల్ని తాజాగా వెల్లడించింది. ప్రధాన నిందితుడు రిభవ్ రిషి ఓ మహిళా డ్యాన్సర్‌తో ప్రేమ వ్యవహారం, ఆమె కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సంగతులను దర్యాప్తు అధికారులు తాజాగా మీడియాకు తెలిపారు. అతడితో ప్రేమ వ్యవహారం సాగించిన సదరు మహిళా డ్యాన్సర్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాల్ని వెల్లడించింది. 2025లో పరిచయమైన రిషితో సాన్నిహిత్యం పెరిగినట్టు ఆమె సీబీఐకి తెలిపింది. భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకుంటానని, ప్రతినెలా ఖర్చుల కోసం రూ.10 లక్షలు ఇస్తానని రిషి ఒప్పుకున్నట్టు తెలిపింది. దశలవారీగా మొత్తం రూ.56 లక్షలు చెల్లించినట్టు పేర్కొన్నది. ఆమె కోసం ఢిల్లీలోని ద్వారకలో రూ.4 కోట్లతో ఖరీదైన ఇంటిని రిషి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి తాను ఆ ఇంట్లోనే ఉంటున్నట్టు ఆమె చెప్పింది. అంతేగాక రిషి ఏర్పాటుచేసిన ఖరీదైన పార్టీలకు హర్యానా ప్రభుత్వ అధికారులు, బ్యాంకు ఉద్యోగులు, ఇతర నిందితులు హాజరైనట్లు వెల్లడించింది. రిషితో కలిసి ఆమె మకావో, థాయ్‌లాండ్, దుబాయ్‌ల తదితర దేశాల్లో విహారానికి వెళ్లినట్టు వివరించింది. దుబాయ్‌లో కొత్త ఎయిర్పోర్ట్ సమీపంలో ఓ ఖరీదైన డూప్లెక్స్ ఇంటిని చూపించాడని, భవిష్యత్తులో ఇద్దరూ అక్కడ స్థిరపడాలని భావించినట్టు తెలిపింది. ప్రభుత్వ శాఖల బ్యాంక్ ఖాతాల నుంచి భారీ మొత్తంలో నిధులను అక్రమంగా తరలించినట్టు రిభవ్ రిషిపై ఆరోపణలు ఉన్నాయి. పలు ప్రభుత్వ శాఖల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ.187.35 కోట్ల విలువైన కనీసం 25 అనుమానాస్పద డెబిట్ లావాదేవీలకు రిషి అనుమతి ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది.