న్యూఢిల్లీ: డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (డీపీపీడీ) నిబంధనలు వార్తల సేకరణకు అడ్డంకిగా మారుతున్నాయని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్పీఏ) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. ఈ చట్టంలోని కొన్ని నిబంధనలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించి కొట్టివేయాలని కోరింది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను నవంబర్ 17న చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది.
పిటిషన్ ఏమిటి?
డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీపీడీ) చట్ట నిబంధనల్లో జర్నలిస్టులకు మినహాయింపు లేదని డీఎన్పీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. వార్తల కోసం వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేటప్పుడు వారి సమ్మతి తీసుకోవడం తప్పనిసరి చేస్తే జర్నలిస్టులు తమ విధులను సక్రమంగా నిర్వహించలేరని పేర్కొంది. పరిశోధనాత్మక వార్తలు రాయడం, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను వెలుగులోకి తేవడం, వార్త మూలాల వివరాలను రహస్యంగా ఉంచడం కష్టమవుతాయని వాదించింది.
డీఎన్పీఏ తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపిస్తూ.. ‘సంబంధిత వ్యక్తి సమ్మతి ఇస్తారా? లేదా అన్నదానిపై ఆధారపడాల్సి వస్తే వార్తలను ఎలా ప్రసారం చేయగలం? టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ముందస్తు అనుమతి సాధ్యమేనా? ఈ నిబంధనలు వార్తాసంస్థల కార్యకలాపాలనే దెబ్బతీయవవచ్చు’ అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)(జే)కు చేసిన సవరణను కూడా డీఎన్పీఏ సవాలు చేసింది. ఈ మార్పు వల్ల ప్రభుత్వ అధికారులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తెలుసుకోవడం కష్టమవుతుందని వాదించింది.