Supreme Court has clarified that the benefits of caste-based reservations do not continue after a change in religion 
జాతీయ వార్తలు

మతం మారితే రిజర్వేషన్ వర్తించదు : సుప్రీంకోర్టు

మతం మారినంత మాత్రాన గతంలో ఉన్న కుల ఆధారిత రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించలేదు.

S. Pavan

న్యూఢిల్లీ : రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు మరోమారు కీలక తీర్పు వెలువరించింది. మతాన్ని మార్చుకున్న వ్యక్తికి అంతకుముందు ఉన్న కులం దాని సామాజికస్థితి, రిజర్వేషన్ హక్కులు కొనసాగవని స్పష్టం మరోసారి స్పష్టం చేసింది. హిందూ మతానికి చెందిన బీసీ వ్యక్తి ఇస్లాంలోకి మారితే, ‘ముస్లిం బీసీ’ కేటగిరీ కింద రిజర్వేషన్‌ పొందేందుకు అర్హుడు కాదని సుప్రీంకోర్టు గురువారం తేల్చి చెప్పింది. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది.

హిందూ మతంలోని బీసీ, ఎంబీసీ, డీనోటిఫైడ్ కమ్యూనిటీలు, ఎస్సీ వర్గాలకు చెందిన వారు ఇస్లాం మతంలోకి మారినా రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగేలా తమిళనాడు ప్రభుత్వం 2024 మార్చి 9న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అమలుజేయరాదంటూ మద్రాస్ హైకోర్టు జూన్ 25న ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. తమిళనాడు అనుసరించిన ఇలాంటి విధానం వల్ల రిజర్వేషన్ ప్రయోజనాలు పొందేందుకు ఒక ‘కృత్రిమ వర్గం’ ఏర్పాటవుతుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎస్సీ రిజర్వేషన్‌పై 1951 నాటి తీర్పును ప్రస్తావించింది. ఒక వర్గాన్ని వెనుకబడినదిగా గుర్తించి రిజర్వేషన్ ఇవ్వాలంటే సామాజిక పరిస్థితులపై సమగ్ర పరిశీలన, గణాంకాలు, చట్టపరమైన ప్రక్రియ అవసరమని జస్టిస్ మిశ్రా తెలిపారు.

రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగవు

తూత్తుకుడి జిల్లాకు చెందిన సమీర్ అహ్మద్‌, 2015లో హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారాడు. అనంతరం తనకు ‘ముస్లిం బీసీ’గా సర్టిఫికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా, తహసీల్దార్ ఆయన దరఖాస్తును తిరస్కరించారు. దీనిపై సమీర్ అహ్మద్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్ర బీసీ కమిషన్ సిఫార్సుల ఆధారంగా అర్హులైన వ్యక్తులకు ‘బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ముస్లిం)’ కమ్యూనిటీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి తమకు అధికారం ఉందని తమిళనాడు ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. కాగా, హైకోర్టు ఈ వాదనను తిరస్కరించింది. ‘ఇస్లాంలోకి మారిన వ్యక్తి గతంలో ఉన్న హిందూ కులం లేదా ఉపకులానికి సంబంధించిన రిజర్వేషన్ ప్రయోజనాలను అలాగే కొనసాగించలేడు’ అని హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.