దుబాయ్ నగరం నుంచి బయలుదేరి ఇజ్రాయిల్ వెళుతున్న ఫ్లయ్దుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానంలో ఊహించని భయానక ఘటన చోటుచేసుకుంది. గగనతలంలో విమానం ప్రయాణిస్తుండగా కాక్‌పిట్‌లో ఒక పైలట్ మరో పైలట్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. దీంతో అదుపుతప్పిన విమానం కేవలం 30 సెకండ్లలోనే 14,000 అడుగుల ఎత్తుకు దిగిపోయింది. ఓ 20 సెకండ్ల పాటు విమానం తీవ్రమైన కుదుపులకు లోనైంది. కో పైలట్ దాడులతో తీవ్ర రక్తస్రావం అవుతున్నా భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ముప్పు తప్పింది. మచ్చార్‌కు విమానంలోనే ఉన్న ఓ డాక్టర్ ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం తబూక్‌లోని ఆసుపత్రిలో ఉన్న మచ్చార్ ఆరోగ్యస్థితి నిలకడగా ఉందని సౌదీలోని భారత రాయభార కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
హైజాక్ యత్నమా.. ఉగ్ర కుట్రనా?
విమానంలో సాంకేతిక నియంత్రణ తారుమారు కాగానే అత్యవసర '7500' కోడ్ సంకేతం ప్రసారమైంది. అంతర్జాతీయ విమానయాన నిబంధనల ప్రకారం ఇది హైజాక్ లేదా అక్రమ చొరబాటును సూచిస్తుంది. అలర్ట్ అందుకున్న ఇజ్రాయిల్ వాయుసేన ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది. మరోవైపు సెప్టెంబర్ 11 తరహాలో టెల్ అవీవ్ నగరానికి చేరేలోపే విమానాన్ని కూల్చివేసి ఆత్మాహుతి దాడికి ఒడిగట్టే యత్నమా? అనే కోణంలో భద్రతా బలగాలు శోధిస్తున్నాయి. దాడికి పాల్పడిన వ్యక్తి ఒమన్ దేశస్థుడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కెప్టెన్ పట్టుదల.. ప్రయాణికుల ధైర్యం
కత్తిపోట్లతో శరీరం ఛిద్రమైనా కెప్టెన్ స్మిత్ మచ్చార్ అసమాన ధైర్యాన్ని ప్రదర్శించారు. క్షణాల వ్యవధిలో కాక్‌పిట్ డోర్ తెరవడంతో ప్రయాణికులు లోపలికి దూసుకెళ్లి దాడి చేస్తున్న వ్యక్తిని బంధించారు. అదే సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు యూరప్‌కు చెందిన ఆఫ్-డ్యూటీ పైలట్లు విమాన నియంత్రణను తక్షణమే చేతుల్లోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ సాహసాన్ని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేకంగా కొనియాడారు. ఘటన వెనుక ఉన్న కుట్రపై అంతర్జాతీయ భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. మచ్చార్ సాహసానికి దేశం గర్వపడుతోందని భారత రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేయగా, మచ్చార్ కుటుంబానికి ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు.