Special Parliament Session Likely This Month To Pass Women's Quota And Delimitation Bills 
జాతీయ వార్తలు

ఈ నెలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు?.. మహిళలకు శుభవార్త!

డీఎంకే, మరికొన్ని చిన్న పార్టీల మద్దతు పొందేందుకు ఎన్డీయే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, గతంలో వ్యతిరేకించిన డీఎంకే వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Madhu

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన కీలక బిల్లులను ఆమోదింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నెలాఖరులో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఈ బిల్లులను ఆమోదించేందుకు అవసరమైన సంఖ్యాబలం కూడా తమకు ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపింది.

 అక్టోబర్ చివర్లో ప్రత్యేక సమావేశాలు?

‘పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిసినప్పటికీ, వాటిని అధికారికంగా ప్రొరోగ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. సమావేశాల తేదీలను అక్టోబర్ 26, 27 తేదీల్లో జరగనున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రత్యేక సమావేశాలకు ముందు సుమారు వారం రోజుల నోటీస్ ఇవ్వొచ్చు’ అని కథనం పేర్కొన్నది.

 డీఎంకే, చిన్న పార్టీలతో కేంద్రం చర్చలు

లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లులకు అవసరమైన మద్దతును కూడగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన డీఎంకే, మరికొన్ని చిన్న పార్టీల మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని డీఎంకే గతంలో తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

 గతంలో బిల్లుకు ఎదురుదెబ్బ

ఈ ఏడాది ఏప్రిల్ 17న జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ రెండు బిల్లుల నిమిత్తం రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన మద్దతును పొందలేకపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత జరిగిన వర్షాకాల సమావేశాల్లోనూ ఈ బిల్లులను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావించినప్పటికీ, నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదం, ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), ఇతర రాజకీయ పరిణామాలతో పార్లమెంటు కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. దీంతో బిల్లులపై తదుపరి చర్యలు వాయిదా పడ్డాయి. కాగా, లోక్‌సభలో ప్రస్తుతం 540 మంది సభ్యులు ఉండగా, బిల్లుల ఆమోదానికి సుమారు 360 మంది సభ్యుల మద్దతు అవసరమని కథనం పేర్కొన్నది.