జాతీయ వార్తలు

ఏఐ దారిలో నీలేకని.. ఆలోచనలో పడేసిన ఆనంద్‌!

దేశంలో పోటీ పరీక్షల నిర్వహణకు ఏఐ ప్రశ్నపత్రాలు, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని ప్రతిపాదిస్తుంటే.. ఈ విధానంపై విద్యావేత్త ఆనంద్‌ కుమార్‌ సందేహాలు లేవనెత్తారు.

Phaneendra

పేపర్‌ లీకేజీలకు సాంకేతికతతో చెక్‌ పెట్టడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానంగా ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని ఓ కొత్త ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారు. అయితే, ప్రముఖ విద్యావేత్త, సూపర్‌ 30 వ్యవస్థాపకుడు ఆనంద్‌ కుమార్‌ మాత్రం ఈ అంశాన్ని మరో కోణంలో చూస్తున్నారు. ఒకరు సాంకేతికతతో పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తుంటే.. మరొకరు ఆ మార్పుల వల్ల ఎదురయ్యే పరిణామాలపైనా దృష్టి సారిస్తున్నారు. ఈ ఇద్దరి ఆలోచనల మధ్య ఉన్న అంతరమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు నీలేకని ఆలోచన ఏంటి? ఆనంద్‌ కుమార్‌ ప్రస్తావిస్తున్న అంశాలేంటి? తెలుసుకుందాం..

పరీక్ష రోజే ప్రశ్నపత్రం.. ఏఐతో  నీలేకని కొత్త ప్లాన్‌!

పోటీ పరీక్షల పేపర్‌ లీకేజీలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మెడికల్, డెంటల్ సీట్ల భర్తీ కోసం గత మేలో నిర్వహించిన నీట్ యూజీ పేపర్ లీక్ కావడం దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. ఆ నేపథ్యంలో విద్యార్ధులు చేపట్టిన జెన్-జీ ఉద్యమంతో అప్పటి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. తిరిగి నీట్ యూజీ పరీక్షను నిర్వహించే క్రమంలో యుద్ధ విమానాల ద్వారా ప్రశ్నపత్రాలను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇటువంటి పరిస్థితులు తిరిగి పునరావృత్తం కాకుడాదనే ఉద్దేశంతో ఈ సమస్యకు  సాంకేతిక పరిష్కారాన్ని సూచించారు ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని. 2026 మేలో నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో పరీక్షల సంస్కరణల కోసం జులైలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌కు నందన్‌ నీలేకని నేతృత్వం వహిస్తున్నారు.

 లీకేజీకి ఆస్కారం కల్పించే దశలను తగ్గించాలని

నీలేకని సూచించిన వాటిల్లో కీలకమైంది ఏఐ సాయంతో ప్రశ్నపత్రాన్ని రూపొందించడం. ప్రస్తుతం చాలా పరీక్షల్లో ప్రశ్నపత్రాలను ముందుగానే తయారు చేసి, ముద్రించి, పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు. ఈ ప్రక్రియలో ప్రింట్ చేసే సంస్థ నుంచి లేదా పేపర్ సెట్టర్ లేదా ఇతర మార్గాల ద్వారా పేపర్ లీక్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. గతంలో ఇటువంటి అనుభవాలను కూడా చూశాం. దీంతో పేపర్‌ లీకేజీకి ఆస్కారం కల్పించే దశలను తగ్గించాలని  నీలేకని అభిప్రాయపడ్డారు. ముందుగానే ఒక స్థిరమైన ప్రశ్నపత్రాన్ని తయారు చేయడానికి బదులుగా.. పెద్ద ప్రశ్నల డేటాబేస్‌ను సిద్ధం చేసి, పరీక్షకు కొద్దిసేపటి ముందే అందులోంచి ప్రశ్నపత్రాన్ని రూపొందించవచ్చని సూచించారు. నీలేకని ప్రతిపాదన ప్రకారం.. ముందుగా విస్తృతమైన ప్రశ్నల బ్యాంకును సిద్ధం చేయాలి. అందులోని ప్రశ్నల నుంచి పరీక్షకు అవసరమైన ప్రశ్నపత్రాన్ని చివరి నిమిషంలో రూపొందించాలి. ఇందుకు ఏఐని ఉపయోగించే అవకాశం ఉంది. అయితే ప్రశ్నల ఎంపిక, వాటి కఠినత స్థాయి, సిలబస్‌కు అనుగుణంగా ప్రశ్నల పంపిణీ, అన్ని ప్రశ్నపత్రాల్లో సమాన స్థాయి ఉండేలా చూడటం కోసం పటిష్ఠమైన వ్యవస్థ ఉండేలా చూడాలి.

 CBT విధానంలో పరీక్షలు

ప్రశ్నపత్రాల తయారీలోనే కాకుండా.. పరీక్షలు నిర్వహించే విధానంలోనూ మార్పులు తీసుకురావాలని నీలేకని సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని రకాల పోటీ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల (CBT) విధానంలో నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం సుమారు 1.5 లక్షల CBT పరీక్షా కేంద్రాల ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని అన్నారు. డిజిటల్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తే ముద్రించిన ప్రశ్నపత్రాల రవాణా, పంపిణీకి సంబంధించిన కొన్ని సమస్యలను తగ్గించవచ్చన్నారు. అయితే కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల్లోనూ సర్వర్‌ భద్రత, డేటా రక్షణ, సాంకేతిక అంతరాయాలు, పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కీలకంగా మారతాయి.

ఏఐ తప్పు చేస్తే బాధ్యత ఏవరిది : ఆనంద్

నందన్‌ నీలేకని చేసిన ఈ ప్రతిపాదనపై  ప్రముఖ విద్యావేత్త, సూపర్‌ 30 వ్యవస్థాపకుడు ఆనంద్‌ కుమార్‌ ఈ విధానంపై సందేహాలు వ్యక్తం చేశారు. సాంకేతికతతో పేపర్‌ లీకేజీలను అరికట్టే ప్రయత్నంలో పేద, గ్రామీణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఎలా? ఏఐ రూపొందించే ప్రశ్నల్లో తప్పులు దొర్లితే ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ కీలక ప్రశ్నలు లేవనెత్తారు.

 మారుమూల గ్రామాల్లో, పేద కుటుంబాల్లో ఎంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు ఉంటారు. వారికి కంప్యూటర్లతో పరిచయం, సాధన చేసే అవకాశాలు తక్కువగా ఉండొచ్చని ఆనంద్ కుమార్ అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో పరీక్షలను పూర్తిగా కంప్యూటర్‌ ఆధారిత విధానంలోకి మార్చితే.. ఇప్పటికే వనరుల కొరతతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు మరింత వెనుకబడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల భద్రతను పెంచడం ఎంత ముఖ్యమో.. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి సమాన అవకాశం కల్పించడం కూడా అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

 సహాయక పాత్రకే ఏఐ పరిమితమవ్వాలి

వేలాది ప్రశ్నలతో కూడిన డేటాబేస్‌ నుంచి చివరి నిమిషంలో ప్రశ్నపత్రాన్ని రూపొందించడం మరో సవాలుగా మారవచ్చని ఆనంద్‌ కుమార్‌ పేర్కొన్నారు. పోటీ పరీక్షల్లో పరిమిత సంఖ్యలో ప్రశ్నలు ఉన్నప్పటికీ.. ఏటా ఏదో ఒక సందర్భంలో ప్రశ్నల్లో తప్పులు తలెత్తుతున్నాయని గుర్తుచేశారు. అలాంటప్పుడు వేలాది ప్రశ్నల నుంచి ఏఐ ఎంపిక చేసిన ప్రశ్నలన్నీ కచ్చితంగా సరైనవేనని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. నీట్‌ వంటి కీలక ప్రవేశ పరీక్షల్లో ఒక్క ప్రశ్నలో పొరపాటు జరిగినా అభ్యర్థి మార్కులపై, మెడికల్‌ కాలేజీలో సీటు పొందే అవకాశంపై ప్రభావం పడవచ్చు. అందుకే ప్రశ్నల ఎంపికలో ఏఐని ఉపయోగించినప్పటికీ.. వాటి నాణ్యత, సిలబస్‌కు అనుగుణంగా ఉండటం, కఠినత స్థాయి వంటి అంశాలను నిపుణులు పరిశీలించడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. తాను సాంకేతికతకు లేదా ఏఐకి వ్యతిరేకం కాదని ఆనంద్‌ కుమార్‌ స్పష్టం చేశారు. విద్యారంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని, ప్రశ్నపత్రాల తయారీలో నిపుణులకు సహాయపడగలదని అభిప్రాయపడ్డారు. అయితే ఏఐని సహాయక సాధనంగా ఉపయోగించడం వేరు.. తుది నిర్ణయాలను దానికే వదిలేయడం వేరని పేర్కొన్నారు. పరీక్షల అసలు లక్ష్యం సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించడం కాదని.. దేశంలోని ప్రతి మూలలో ఉన్న ప్రతిభను గుర్తించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక చిన్న పొరపాటు వల్ల విద్యార్థికి కొన్ని మార్కులు మాత్రమే కాకుండా, అతడి కల కూడా దెబ్బతినవచ్చని హెచ్చరించారు.