వాషింగ్టన్: దడ పుట్టిస్తున్న సూపర్ ఎల్ నినో భారీ ప్రాణ నష్టాన్ని మిగల్చబోతోందా ? దీని ఫలితంగా ఏర్పడే కరువులు, వరదలు, తుఫానులు ప్రజానీకం ప్రాణాలను బలిగొనబోతున్నాయా ? అంటే, ఔను అని అమెరికాకు చెందిన క్లయిమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మరుగుతున్న పసిఫిక్ మహా సముద్ర జలాల నుంచి ఏర్పడిన వేడిని తట్టుకోలేక 2026 అక్టోబర్ –2027 మార్చి మధ్యకాలంలో భారత్‌లో అత్యధికంగా 55వేల మంది చనిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మరణాలలో ఎక్కువ భాగం మార్చిలోనే జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్‌తో రాబోయే ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 3.73 లక్షలకుపైగా మరణాలు సంభవించొచ్చని ఆ సంస్థ రూపొందించిన ‘హీట్ మోర్టాలిటీ ట్రాకర్’లో పొందుపరిచారు.
అధ్యయనం ఇలా జరిగింది
సూపర్ ఎల్ నినో వల్ల ఏయే దేశాల్లో ఎక్కువ మంది చనిపోయే అవకాశముందనే దానిపై అధ్యయన నివేదికను క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇందుకోసం గత కొన్ని దశాబ్దాల వాతావరణ రికార్డులను, ప్రజల ఆరోగ్య డేటాను అత్యాధునిక సూపర్ కంప్యూటర్లతో విశ్లేషించారు. పసిఫిక్‌లో తేలుతున్న బ్యుయోస్ సెన్సర్లు, వాతావరణ ఉపగ్రహాల ద్వారా ఆ సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రత 3.08 డిగ్రీలు మేర పెరిగినట్లు నిర్ధారించారు. దీని ఫలితంగా భారత్, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో సాధారణం కంటే 44 శాతం ఎక్కువగా వేడి రోజులను(భారీ ఉష్ణోగ్రతలు) ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందనే అంచనాకు వచ్చారు. దీని ఆధారంగా రాబోయే 6 నెలల్లో భూమిపై ఏయే ప్రాంతాల్లో వేడి గాలులు తీవ్రంగా వీస్తాయనేది మ్యాపింగ్ చేశారు. ఈ సమాచారాన్ని కంప్యూటర్ మోడల్స్‌లో ప్రవేశపెట్టగా ఏయే దేశాలకు ఎంతమేర మరణాల ముప్పు ఉంటుందనే దానిపై ‘హీట్ మోర్టాలిటీ ట్రాకర్’ రూపొందింది.
మరణాల ముప్పు ఎక్కువగా ఉన్న దేశాలివే(హీట్ మోర్టాలిటీ ట్రాకర్ ప్రకారం)
దేశం - మరణాల సంఖ్య (అంచనా)
నైజీరియా - 56,100
భారత్ - 55,200
ఇండోనేషియా- 29,300
బ్రెజిల్- 19,500
సూడాన్-14,700
మూడో వంతు మరణాలు ఈ దేశాల్లోనే
ఈ నివేదిక ప్రకారం, ఎల్ నినో ప్రభావంతో సంభవించే అవకాశమున్న 3.73 లక్షల మరణాలలో మూడో వంతు కేవలం నైజీరియా, భారత్, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాలలోనే జరుగుతాయి. అంటే, ఈ ప్రకృతి విపత్తు అనేది ప్రధానంగా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలకే పెను సవాల్‌గా మారనుంది. ‘తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల వచ్చే ప్రాణాంతక ప్రభావాలను ముందే అంచనా వేయడం ఒక పెద్ద అడుగు. దీనివల్ల మరణాల ముప్పు ఎక్కువున్న ప్రాంతాలను గుర్తించి, ప్రాణనష్టం జరగకముందే నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది’ అని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ సహ వ్యవస్థాపకుడు మైఖేల్ గ్రీన్‌స్టోన్ చెప్పారు.