న్యూ ఢిల్లీ: ప్రభుత్వాలు ఏ పౌరుడి భూమినైనా సరే కేవలం ప్రజాప్రయోజనం కోసమే స్వాధీనం చేసుకోవాలి గానీ కొన్ని ప్రత్యేక వర్గాలకో లేక ప్రైవేట్ సంస్థలకో లబ్ధి చేకూర్చడానికి కాదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. బెంగళూరు నగర శివార్లలో 59 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములను ఒక సహకార గృహనిర్మాణ సంఘం కోసం కర్ణాటక ప్రభుత్వం గతంలో బలవంతంగా లాక్కుంది. 1988లో మొదలైన ఈ వివాదం దశాబ్దాల పాటు సాగింది. జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ అన్యాక్రాంతాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. "ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను ప్రజాప్రయోజనాల కోసం చట్టబద్ధమైన అధికారంతో మాత్రమే స్వాధీనం చేసుకోవాలి. సరైన పరిహారం ఇవ్వడం ఒక్కటే దీనికి సరిపోదు. చట్ట నిబంధనలు లేకపోతే ప్రభుత్వాలు ఈ అధికారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించలేవు." అని తెలిపింది అత్యున్నత న్యాయస్థానం. సుదీర్ఘ విచారణ అనంతరం ఆనాటి భూసేకరణ ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేసింది. సుమారు 38 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ భూములను మళ్లీ అసలు యజమానులకు అప్పగిస్తూ చరిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది.
మధ్యవర్తుల మోసాలు
ఈ మొత్తం ఉదంతంలో దళారుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. నిస్సహాయులైన పౌరులపై అధికార యంత్రాంగాన్ని అడ్డంపెట్టుకుని ఘోరమైన మోసానికి పాల్పడ్డారని ధర్మాసనం పేర్కొంది. ప్రైవేట్ వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేశారని విచారణలో తేలింది. ఎలాంటి చట్టబద్ధత లేకుండా అమాయకుల ఆస్తులను కాజేయడం తీవ్రమైన నేరమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఈ పోరాటంలో కోర్టును ఆశ్రయించి తమ హక్కులను కాపాడుకున్న ప్రతి యజమానికి 50 వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా అన్యాక్రాంతమైన భూముల బాధితులకు పెద్ద ఊరటనిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారాలు ప్రజల సంక్షేమం కోసమే తప్ప కొందరి ప్రయోజనాల కోసం కాదని ఈ పరిణామం మరోసారి రుజువు చేసింది