న్యూఢిల్లీ : ఓబీసీ క్రీమీలేయర్‌ను అమలు చేసేందుకు రెండేండ్లు గడువు ఇవ్వలేమని సుప్రీంకోర్టు.. కేంద్రానికి స్పష్టం చేసింది. మార్చి 11న ఇచ్చిన తీర్పును మార్చే ప్రసక్తే లేదని పేర్కొన్నది. 2025 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపికైన ఓబీసీ అభ్యర్థులకూ మార్చి తీర్పులోని నిబంధనలనే అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే పూర్తయిన నియామకాలకు ఈ తీర్పు వర్తించదని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలంటే రెండేండ్ల గడువు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ (మిసిలేనియస్ అప్లికేషన్) పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
మార్చి 11న కీలక తీర్పు
ఓబీసీ క్రీమీలేయర్ అర్హతపై ఈ ఏడాది మార్చి 11న ‘యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రోహిత్ నాథన్’ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘తల్లిదండ్రుల వేతనం ఆధారంగా మాత్రమే ఓబీసీ అభ్యర్థిని క్రీమీలేయర్‌గా పరిగణించకూడదు. జీతం, వ్యవసాయ ఆదాయం, ఇతర ఆదాయాలను కలిపి ఒకే మొత్తంగా లెక్కించొద్దు. తల్లిదండ్రులు పనిచేసే ఉద్యోగ హోదా, స్థాయికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగ హోదాల సమానత్వం నిర్ధారించని సందర్భాల్లో నిబంధనల ప్రకారం ఆదాయం– ఆస్తి పరీక్షను విడిగా వర్తింపజేయాలి. సమాన హోదాల్లో పనిచేసే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థల ఉద్యోగుల పిల్లల విషయంలో వేర్వేరు ప్రమాణాలు పాటించకూడదు. అలా చేయడం రాజ్యాంగంలోని 14, 16 అధికరణాలకు విరుద్ధమైన వివక్షకు దారితీస్తుంది’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గడువు కోరిన కేంద్రం
కాగా తీర్పు అమలు చేయాలంటే రెండేండ్లు సమయం కావాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వివిధ సంస్థల్లోని ఉద్యోగాల హోదాలను ప్రభుత్వ ఉద్యోగాల్లోని సమానస్థాయి పదవులతో పోల్చి గుర్తించాల్సి ఉందని వివరించింది. ఇందుకోసం సంబంధిత వర్గాలతో చర్చలు జరపాలని, ఓబీసీ క్రీమీలేయర్ అర్హతను నిర్ణయించేందుకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని రూపొందించాలని తెలిపింది. ఈ ప్రక్రియకు రెండేళ్ల గడువు అవసరమని కేంద్రం అభ్యర్థించగా న్యాయస్థానం తిరస్కరించింది. మార్చి 11 తీర్పును అంతకుముందు తేదీ నుంచి అమలు చేస్తే దేశవ్యాప్తంగా భారీ ప్రభావం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తన అభ్యర్థనలో పేర్కొంది. దీంతో ఈ విషయంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. తీర్పు వెలువడకముందే పూర్తయిన నియామకాలకు ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేసింది. మార్చి తీర్పు తమ ముందు విచారణలో భాగస్వాములైన అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.