ప్రభాత ఉదయం,హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో తిష్టవేసి అమాయక ప్రజల ఖాతాలను కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఛేదించింది. సెప్టెంబర్ 23న ప్రారంభమైన భారీ ప్రత్యేక ఆపరేషన్ రెండు వారాల పాటు కేరళం, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ సహా పుదుచ్చేరి ప్రాంతాల్లో ముమ్మరంగా సాగింది. మొత్తం 100 మంది సిబ్బందితో 6 ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించి 101 మంది నిందితులను కటకటాల వెనక్కి నెట్టాయి. పట్టుబడిన వారిలో 18 మంది మహిళలు సైతం ఉన్నారని హోం శాఖ ముఖ్య కార్యదర్శి, టీజీసీఎస్బీ డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ వెల్లడించారు. వీరి నెట్వర్క్ గుప్పిట్లో నలిగిన సుమారు రూ.17 కోట్ల మోసపూరిత ఆర్థిక లావాదేవీలను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుల ఆధీనంలో ఉన్న సెల్ఫోన్లు, సిమ్ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్కులు, చెక్కుబుక్కులను స్వాధీనం చేసుకున్నారు.
దేశవ్యాప్తంగా 1,172 నేరాలతో సంబంధాలు
టీజీసీఎస్బీ పరిధిలోని ఏడు సైబర్ క్రైమ్ ఠాణాల్లో నమోదైన 51 కేసుల మూలాలను శోధిస్తూ ఈ అరెస్టులు చేపట్టారు. కేవలం ఈ నిందితులకు మాత్రమే దేశవ్యాప్తంగా దాదాపు 1,172 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు తేలింది. వీటిలో ఒక్క తెలంగాణలోనే 206 కేసులు నమోదై ఉన్నాయి. అరెస్టయిన వారిలో 50 మందికి పైగా వ్యక్తులు దేశవ్యాప్తంగా కనీసం ఐదేసి కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. వరంగల్ సీసీపీఎస్ కేసు విచారణలో వెల్లడైన ఆధారాలతో బెంగళూరులో తుకారాం హెంబాడేను కర్ణాటక బృందం అదుపులోకి తీసుకుంది. అలాగే అనకాపల్లిలో కొక్కెర్లపాటి సిద్ధువర్ను ఏపీ బృందం, సినిమా పైరసీకి సంబంధించిన వ్యవహారంలో పుదుచ్చేరి కేంద్రంగా సి.విజయ్ కుమార్‌ను దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. ఈ నేర సూత్రధారుల వెనుక అంతర్జాతీయ లింకులు కూడా ముడిపడి ఉన్నాయని, విదేశీ ముఠాల ప్రమేయంపైనా లోతైన విచారణ సాగుతోందని అధికారులు తెలిపారు.
కేరళం లోనే అత్యధిక అరెస్టులు.. చదువుకున్నవారే అధికం
రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే కేరళలో అత్యధికంగా 35 మంది అరెస్టయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 22, కర్ణాటకలో 17, తమిళనాడులో 14, తెలంగాణలో 12, పుదుచ్చేరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన 101 మందిలో 19 మంది ఏజెంట్లు కాగా, 81 మంది కమీషన్లకు ఆశపడి బ్యాంకు ఖాతాలు సమకూర్చిన ‘మ్యూల్ అకౌంట్’ దారులు. నిందితుల్లో 82 శాతం మంది 20 ఏళ్ల లోబడి 50 ఏళ్ల మధ్య వయస్కులు కావడం గమనార్హం. ఇందులో సొంత వ్యాపారాలు చేసుకునేవారు 23 శాతం, ప్రైవేటు ఉద్యోగులు 13 శాతం, గృహిణులు 10 శాతం ఉన్నారు. చదువు పరంగా 24 శాతం మంది డిగ్రీలు, 26 శాతం మంది ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారున్నారు. వీరిలో 11శాతం నిరక్షరాస్యులు ఉన్నారు.
కమీషన్ల ఎర.. కార్పొరేట్ ఉద్యోగుల భాగస్వామ్యం
మోసాల ద్వారా కొల్లగొట్టిన సొమ్ములో కేవలం 5 శాతం కమీషన్ ఆశజూపి నిందితులు అమాయకుల, నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాలను దారిమళ్లించారు. ఆ ఖాతాల్లో పడిన సొమ్మును ఏటీఎంల ద్వారా డ్రా చేయడం, హవాలా లేదా ఇతర విదేశీ మార్గాల్లో బదిలీ చేయడం వీరి ప్రధాన పద్ధతి. ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాకు దేశవ్యాప్తంగా 60 కేసులతో సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. నిందితుల్లో ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగి ఒకరు 50 కేసుల్లో, ఓ వ్యాపారి 34 కేసుల్లో, ఫిల్మ్ టెక్నాలజీ డిప్లొమా పూర్తిచేసిన వ్యక్తి 26 కేసుల్లో, ప్రముఖ మంజూ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మార్కెటింగ్ హెడ్ 15 కేసుల్లో, చివరకు ఓ మాజీ సైనికుడు సైతం ఆరు కేసుల్లో పాత్రధారులుగా తేలడం నేర నెట్వర్క్ విస్తృతికి అద్దం పడుతోంది.
అప్రమత్తతే రక్షాకవచం: టీజీసీఎస్బీ హెచ్చరిక
ప్రస్తుతం సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ తరహా మోసాలపై ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. స్టాక్ మార్కెట్, ఫారెక్స్, క్రిప్టోకరెన్సీల పేరుతో అపరిమిత లాభాలు ఎరవేసే యాప్‌లను, టాస్క్ ఆధారిత ఆదాయ ప్లాట్‌ఫారమ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ విశ్వసించవద్దని హెచ్చరించారు. అపరిచితులకు బ్యాంకు రహస్య వివరాలు, ఓటీపీలు, క్యూఆర్ కోడ్ సమాచారం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఆన్లైన్ మోసాలకు గురైన బాధితులు ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా అధికారిక పోర్టల్ cybercrime.gov.in వేదికగా ఫిర్యాదు చేయాలని సూచించారు.