Three people died after a Mini Cooper car collided with a Scooty near Kochi airport 
జాతీయ వార్తలు

ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్‌డెడ్

కొచ్చి విమానాశ్రయం సమీపంలో మినీ కూపర్ కారు స్కూటీని ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మద్యం సేవించి అతివేగంగా కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Srikanth

ప్రభాత ఉదయం : కేరళంలోని కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. మినీ కూపర్ కారు అదుపుతప్పి స్కూటీని ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను దేవిక, గోపిక, ఇజాజ్‌‌గా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ముగ్గురు ఫ్రెండ్స్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని షాపులో టీ తాగి స్కూటీపై ఇంటికి బయల్దేరారు. అదే సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు, బైక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ముగ్గురు మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన కారును సుహైల్ (19) అనే యువకుడు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో నిందితుడు సుహైల్ మద్యం సేవించి కారు నడిపినట్టు తేలింది. శనివారం రాత్రి స్నేహితులతో కలిసి నిందితుడు మద్యం తాగినట్టు పోలీసులు గుర్తించారు. మద్యం తాగిన తర్వాత నగరంలో మారియట్ హోటల్ బార్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా వారు మద్యం తీసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. మొత్తం మూడు చోట్ల వారు మద్యం తాగినట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు స్పీడ్ గంటకు 120 కి.మీ వేగంతో వెళ్తున్నట్టు పేర్కొన్నారు. కారులో ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్ వేగంగా వెళ్లొద్దని చెప్పినా వినిపించుకోకుండా నిందితుడి డ్రైవింగ్ చేసినట్టు గుర్తించారు. నిందితుడి రక్త నమూనాల పరీక్షలకు సంబంధించిన తుది నివేదికలు రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కారులో మత్తు పదార్థాలకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయా తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం

జార్ఖండ్‌ రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో మంగళవారం ఉదయం కారు అదుపుతప్పి ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.