చేతిపై కమిలిన గుర్తులకు కారణం ఓవర్ డోస్ ట్యాబ్లెట్టేనా.. 
జాతీయ వార్తలు

ట్రంప్ ఆస్పిరిన్ రహస్యం

మానసిక తృప్తి కోసమే ట్యాబ్లెట్ డోసు పెంపు

Srinivas Rao

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఔషధ వినియోగంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గుండె సంబంధిత సమస్యల నివారణకు వైద్యులు సూచించే పరిమాణం కంటే ఎక్కువ మోతాదులో ఆస్పిరిన్ మాత్రలు వాడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఒహియో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ట్రంప్, ఈ మాత్రలు తనకు మానసిక ఉపశమనాన్ని ఇస్తాయని, అందుకే అధిక మోతాదు తీసుకుంటున్నానని స్వయంగా అంగీకరించారు. వైద్యులు మోతాదు తగ్గించమని కోరుతున్నా, తాను దశాబ్దాలుగా పాటిస్తున్న ఈ అలవాటును వదులుకోలేకపోతున్నానని స్పష్టం చేశారు.

వైద్యుల సూచనలు బేఖాతరు

సాధారణంగా గుండె రక్షణకు 81 మిల్లీగ్రాముల మోతాదును వైద్యులు సూచిస్తారు. అయితే ట్రంప్ మాత్రం రోజుకు ఏకంగా 325 మిల్లీగ్రాముల మాత్రలను వాడుతున్నారు. "వైద్యులు చిన్న సైజు టాబ్లెట్లు తీసుకోమని చెబుతున్నారు. కానీ నాకు పెద్ద సైజు బిళ్లలు వేసుకోవడమే సంతృప్తినిస్తుంది. దాదాపు 35 ఏళ్లుగా ఇలాగే వాడుతున్నాను, నాకేమీ కాలేదు నన్ను వదిలేయండి" అని డాక్టర్లకు బదులిచ్చినట్లు ట్రంప్ వివరించారు. రక్తం పలుచగా ఉండటం కోసమే ఈ మాత్రలు వేసుకుంటున్నానని, తనకు ఇది ఎంతో అవసరమని పేర్కొన్నారు.

చేతులపై కమిలిన గుర్తులు

అధిక మోతాదులో ఆస్పిరిన్ వాడకం వల్ల చేతులపై చర్మం కమిలిపోయి నల్లటి మచ్చలు పడుతున్నట్లు ట్రంప్ గతంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ మచ్చలు కనిపించకుండా ఉండేందుకు రోజూ మేకప్ వాడుతున్నట్లు తెలిపారు. మరోవైపు వైట్‌హౌజ్ ప్రతినిధులు మాత్రం ప్రజలతో ఎక్కువగా కరచాలనం చేయడం వల్లే అధ్యక్షుడి చేతులపై కమిలిన గుర్తులు ఏర్పడ్డాయని సమర్థించుకున్నారు. అధ్యక్షుడు స్వయంగా అధిక మోతాదులో మందులు వేసుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించడంతో ఆయన మానసిక స్థితిపై కూడా వైద్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.