జైపూర్: సాధారణంగానైతే ఆయుర్వేద విజ్ఞానంతో వ్యాధులకు చికిత్స చేస్తారు. అయితే, ఇదే ఆయుర్వేదంలో ఒక భాగమైన రసశాస్త్ర (ఐట్రోకెమిస్ట్రీ) పద్ధతిలో ఏకంగా బంగారాన్నే తయారు చేశాడొక భారతీయ శాస్త్రవేత్త. రసశాస్త్రంలో ‘రస’ అంటే ప్రధానంగా ‘పాదరసం’ (మెర్క్యూరీ) అని అర్థం. దీన్ని శుద్ధి చేసి అమృతం లాంటి ఔషధంగా మార్చడమే రసశాస్త్రం ముఖ్య ఉద్దేశం. దీని ప్రాతిపదికనే తాను పాదరసాన్ని 23.77 క్యారెట్ల స్వచ్ఛత గల బంగారంగా మార్చానని రాజస్థాన్‌కు చెందిన సైంటిస్ట్ లాల్ బహదూర్ ప్రకటించారు. పాదరసాన్ని బంగారంగా మార్చే ప్రక్రియను రసశాస్త్రంలో ‘ధాతువాదం’ అంటారని, ఈ పద్ధతిలోనే తాను ల్యాబ్‌లో గోల్డ్‌ను తయారు చేశానని వెల్లడించారు.
శాస్త్రీయ నిర్ధారణకు త్వరలోనే పరీక్షలు
పాదరసం నుంచి బంగారం తయారు చేశామని వారం క్రితమే అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించగా, ఇప్పుడీ జాబితాలో లాల్ బహదూర్ కూడా చేరారు. బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ చేసిన ఈయనకు, 1998లో భారత్ నిర్వహించిన పోఖ్రాన్-II అణుపరీక్షల్లో పాల్గొన్న అనుభవమూ ఉంది. ల్యాబ్‌లో లాల్ బహదూర్ తయారుచేసిన బంగారంలో నుంచి 0.240 గ్రాముల శాంపిల్‌ను రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న కనోడియా కాలేజీ ఫిజిక్స్ ల్యాబ్‌కు పంపించి పరీక్షించారు. దీంతో ఆ శాంపిల్ ఉపరితలంపై 99.04 శాతం బంగారం(23.77 క్యారెట్ల స్వచ్ఛత), 0.48 శాతం వెండి, 0.48 శాతం రాగి ఉన్నట్లు తేలిందని బుధవారం ప్రకటించారు.
అయితే పాదరసాన్నే బంగారంగా మార్చారా? లేదా ? అనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాల్సి ఉంది. ఈ అంశాన్ని తేల్చడానికి త్వరలోనే జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు సైతం శాంపిల్‌ను పరీక్షిస్తారని తెలుస్తోంది. ఎక్స్‌రే ఫ్లోరెసెన్స్ (ఎక్స్ఆర్ఎఫ్), ఐసోటోప్ విశ్లేషణ వంటి శాస్త్రీయ పద్ధతుల ద్వారా శాంపిల్‌లోని మూలకాలను, వాటి ఖచ్చితమైన మోతాదును నిపుణులు నిర్ధారించనున్నారు.