Uttarakhand Ravi Tamta Electric Flying Car Innovation 
జాతీయ వార్తలు

ఇంజనీరింగ్‌ చదవకుండానే ఎగిరే కారు తయారీ.. భారతీయుడి ఘనత!

ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తామ్తా ఎలాంటి ఇంజినీరింగ్ డిగ్రీ లేకుండానే 13 ఏళ్ల కష్టంతో ఒక ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేశారు.

Haji Pasha

డెహ్రాడూన్​:  ఎగిరే కారును తయారు చేయాలంటే పెద్ద చదువులు, అత్యాధునిక ప్రయోగశాలలు అవసరమని అనుకుంటున్నారా? ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తామ్తా మాత్రం తన పట్టుదలతో ఈ ఆలోచనకు రూపమిచ్చారు. అల్మోరా జిల్లాకు చెందిన ఆయన ఇంజనీరింగ్‌ చదవకపోయినా.. 13 ఏళ్ల పాటు శ్రమించి ఎలక్ట్రిక్‌ ఫ్లయింగ్‌ కారును అభివృద్ధి చేశారు.

ఆన్‌లైన్‌ వనరుల సాయంతో సాంకేతిక అంశాలను నేర్చుకుంటూ, స్వయంగా ప్రయోగాలు చేసి ఈ వాహనాన్ని రూపొందించినట్లు రవి తెలిపారు. ఇందుకోసం ‘హాపిడా స్కై ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ట్రయల్స్‌ నిర్వహించినట్లు చెప్పారు.

ఈ ఫ్లయింగ్‌ కారుకు రన్‌వే అవసరం లేదని, హెలికాప్టర్‌ తరహాలో నేరుగా పైకి ఎగిరి, కిందికి దిగగలదని రవి పేర్కొన్నారు. మల్టీ రోటార్‌ డ్రోన్ల సాంకేతికత ఆధారంగా దీనిని అభివృద్ధి చేసినట్లు వివరించారు. విమాన ఇంధనం లేదా ఇథనాల్‌ అవసరం లేకుండా బ్యాటరీతోనే ఇది నడుస్తుందని తెలిపారు. 13 ఏళ్ల కృషితో సాధించిన ఈ ప్రయోగం.. వినూత్న ఆలోచనలకు పట్టుదల తోడైతే కొత్త ఆవిష్కరణలకు మార్గం ఏర్పడుతుందని చాటిచెబుతోంది.