న్యూఢిల్లీ: హాస్టళ్లలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సూరత్ విశ్వవిద్యాలయం హాస్టల్ గదుల్లో ప్రత్యేక సీలింగ్ ఫ్యాన్లను అమర్చారు. ఆత్మహత్యాయత్నాలను నివారించే లక్ష్యంతో ఈ అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. సుమారు 380 వరకు ఈ ప్రత్యేక ఫ్యాన్లను బాలుర, బాలికల హాస్టళ్లలో బిగించారు. ఒక్కో ఫ్యాన్ ధర సుమారు రూ. 1,500 గా ఉంది.
ప్రత్యేక యాంత్రిక విధానం
ఈ ఫ్యాన్లలో ప్రత్యేకమైన స్ప్రింగ్ వ్యవస్థ ఉంటుంది. సాధారణ బరువు కంటే ఎక్కువగా (పది కిలోలకు మించి బరువు) ఉంటే ఈ ఫ్యాన్లు కిందకు వంగుతాయి. అదే సమయంలో విద్యుత్ సరఫరా స్వయంచాలకంగా నిలిచిపోతుంది. దీనివల్ల మానవ శరీరం బరువును ఫ్యాన్ మోయలేని పరిస్థితి ఏర్పడి ప్రాణాపాయం తప్పుతుంది. ఈ సాంకేతికత ద్వారా విద్యార్థుల ప్రాణాలు రక్షించవచ్చని యాజమాన్యం భావిస్తోంది.
పేరెంట్స్ ఏమంటున్నారు..?
ఈ భద్రతా చర్యపై సర్వత్రా చర్చ సాగుతోంది. కేవలం యంత్రాల మార్పులతో సరిపెట్టకుండా మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ అందించాలని తలిదండ్రులు సూచిస్తున్నారు. విద్యాపరమైన ఒత్తిడి తగ్గించడానికి తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. "కేవలం భద్రతా పరికరాలు మాత్రమే కాకుండా విద్యార్థులకు నిరంతరం మానసిక మద్దతు లభించాలి" అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమగ్ర పద్ధతుల ద్వారానే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని విశ్లేషిస్తున్నారు.