షాజహాన్‌పూర్‌లో 101 మంది యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం అందించిన వినయ్ అగర్వాల్ 
జాతీయ వార్తలు

సోదరి లేదని.. 101 మందికి అన్నగా నిలిచి..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త వినయ్ అగర్వాల్ అన్న స్థానంలో ఉండి 101 మంది పేద యువతులకు వివాహాలు జరిపించారు.

Suryanarayana

షాజహాన్‌పూర్‌: అతడికి తోబుట్టువైన సోదరి లేదు. దీంతో పేదరికంలో ఉన్న ఆడపిల్లలను తన సొంత చెల్లెళ్లుగా భావించి వివాహాలు జరిపించి ఆ లోటును తీర్చుకున్నారు. కులం, మతం అనే భేదం లేకుండా 101 మంది హిందూ, ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలిచారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినయ్ అగర్వాల్.

యూపీలోని షాజహాన్‌పూర్‌కు చెందిన ఆయన ఒక వ్యాపారవేత్త. ఆయనకు తోడబుట్టిన సోదరి లేకపోవడంతో ఎంతో ఆవేదనకు గురయ్యేవారు. ఆ లోటును ఎలా తీర్చుకోవాలో ఆలోచించే క్రమంలో తమ ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు గుర్చొచ్చాయి.

వెంటనే వారికి అండగా నిలవాలని భావించి అన్నగా మారారు. 2018 నుంచే తనకు పరిచయం ఉన్నవారు, తన దగ్గర పనిచేసేవారి పిల్లల పెళ్లిళ్లకు వెళ్లి సాయం చేయడం ప్రారంభించారు. వివాహ బాధ్యతలు పూర్తిగా తీసుకుంటే బాగుంటుందని ఆయనకు తల్లి సరోజ్‌ అగర్వాల్‌ సూచించారు. ఆమె సలహాతో 2023లో 11 మంది యువతులకు అన్నగా మారి వివాహం జరిపించారు.

ఆ తర్వాతి సంవత్సరం ఏడాది 21 మందికి, ఆ తర్వాత 51 మందికి వివాహాలు నిర్వహించారు. ఈ ఏడాది ఏకంగా 101 మంది యువతులకు అన్నగా మారారు. తన దివంగత తండ్రి అశోక్‌ అగర్వాల్‌ జ్ఞాపకార్థం ఈ వేడుకను ప్రతిఏటా నిర్వహిస్తున్నారు. పెళ్లి వేడుక నిర్వహించి చేతులు దులుపుకోకుండా వారు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమయ్యే వస్తువులను కూడా అందిస్తుంటారు. ఈ సాయానికి ఆయన కుటుంబం కూడా అండగా నిలవడం గమనార్హం. ఆదివారం నిర్వహించిన ఈ వేడుకలో 93 హిందూ, ఎనిమిది ముస్లిం జంటలు ఒక్కటయ్యాయి.