RBI Repo Rate Hike Gold Prices Drop 
జాతీయ వార్తలు

బంగారం ధరలు తగ్గిపోతాయా ?

​

Haji Pasha
  • రెపోరేటు పెంపు పర్యవసానాలపై సర్వత్రా చర్చ

  • ఆర్​బీఐ తాజా ప్రకటనతో తగ్గిన పసిడి ధర

  • జనవరి 28 నుంచి ఇప్పటిదాకా రేటు 8 శాతం డౌన్​

  • స్వర్ణంలో పెట్టుబడికి ఇదే సరైన సమయం!

న్యూఢిల్లీ: రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) తాజా రెపోరేటు పెంపుతో ఇక బంగారం ధరలు తగ్గిపోతాయా ? మూడున్నరేళ్ల (2023 ఫిబ్రవరి) తర్వాత తొలిసారిగా ఆర్​బీఐ రెపోరేటును పెంచడమనేది పసిడి రేటు పెరుగుదలకు పగ్గాలు వేస్తుందా ? అనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. బుధవారం రోజు ఆర్​బీఐ రెపోరేటును 25 బేసిస్​ పాయింట్ల మేర పెంచడంతో అది 5.25 శాతం నుంచి 5.50 శాతానికి చేరింది. ఈ వార్త వచ్చిన వెంటనే స్పాట్​ గోల్డ్​ మార్కెట్​లో ధరలు తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్​ఛేంజ్​ (ఎంసీఎక్స్)లో ప్రతి 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర దాదాపు రూ.593 మేర తగ్గి రూ.1,49,500కు చేరింది.

జనవరి 28 నుంచి ఇప్పటిదాకా

వాస్తవానికి ఈ ఏడాది జనవరి 28న 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్​లో​ రికార్డు స్థాయిలో పెరిగి రూ.1,62,380కి ఎగిసింది. అప్పటి నుంచి స్వర్ణం రేటు క్రమంగా తగ్గుతూ, సెప్టెంబర్ 28 నాటికి ఏడు వారాల అత్యల్ప స్థాయికి చేరింది. ఆ తేదీన 24 క్యారెట్ల బంగారం ధర రూ.251 తగ్గి రూ.1,50,170కి చేరింది. ఇక అక్టోబరు మొదటివారంలోనూ(అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 7 వరకు) హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీ హెచ్చుతగ్గుల నడుమ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా డాలర్ ఇండెక్స్, అమెరికా ట్రెజరీ రాబడులు పెరగడంతో పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాల ప్రభావం పసిడి మార్కెట్‌పై పడింది. అక్టోబర్ 2న పసిడి ధరలు గరిష్ఠ స్థాయికి చేరినప్పటికీ, మొదటి వారం ముగిసే సమయానికి (అక్టోబర్ 7 నాటికి) ధరలు తిరిగి తగ్గాయి. తాజాగా బుధవారం ఉదయం ఎంసీఎక్స్​లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,500గా నమోదైంది. మొత్తం మీద జనవరి 28 నాటి బంగారం ధర(రూ.1,62,380)తో పోలిస్తే, బుధవారం (అక్టోబరు 7) నాటి పసిడి రేటు దాదాపు 8 శాతం తక్కువగా (రూ.1,49,500) ఉంది. ఈ పండుగల సీజన్ (దసరా, దీపావళి)లో బంగారం కొనాలనుకునే వారికి ఈ 8 శాతం ధరల తగ్గుదల మంచి అవకాశమని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ధర తగ్గడానికి తక్షణ కారణాలివీ

గత 8 నెలలుగా పసిడి ధర తగ్గుముఖం పట్టే బాటలోనే పయనిస్తోంది. బుధవారం ఉదయం ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపు ప్రకటన గోల్డ్ స్పాట్ మార్కెట్‌కు నెగెటివ్ ట్రిగ్గర్‌గా పనిచేసి, ధరల్లో తక్షణ పతనానికి దారితీసింది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో భారత్​లోని ప్రభుత్వ, కార్పొరేట్​ బాండ్లపై వచ్చే రాబడితో పాటు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు కాబట్టి, ఇన్వెస్టర్లు తమ నిధులను సురక్షితమైన ప్రభుత్వ బాండ్ల వైపు మళ్లించడం వల్ల బుధవారం గోల్డ్ స్పాట్ మార్కెట్ ఒత్తిడికి లోనైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రెపో రేటును పెంచినందు వల్ల భారత రూపాయి అంతర్జాతీయంగా స్వల్పంగా బలపడింది. భారత్​ బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు రూపాయి కొంతమేర బలపడినందున, బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి అయ్యే ఖర్చు తగ్గనుంది. ఈ ప్రభావం నేరుగా దేశీయ స్పాట్ మార్కెట్​పై పడి పసిడి ధరల తగ్గుదలకు దారితీసిందని అంటున్నారు.

బంగారం ధరల పయనమెటు ?

ఆర్​బీఐ రెపో రేటు కంటే అమెరికా సెంట్రల్ బ్యాంకు తీసుకునే వడ్డీరేట్ల నిర్ణయాలే అంతర్జాతీయ బంగారం ధరలను ఎక్కువగా శాసిస్తాయి. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు అనేది భారత్​లో బంగారం ధరలు విపరీతంగా పెరగకుండా ఒక బ్రేక్​లా పనిచేస్తుంది. కానీ ప్రపంచ మార్కెట్ ఒడిదొడుకులు, అమెరికా – ఇరాన్​, రష్యా – ఉక్రెయిన్​ యుద్ధ భయాలు ఎక్కువగా ఉంటే మాత్రం రెపో రేటు పెరిగినప్పటికీ, బంగారం  ధరలు పెరగడం ఇకపైనా కొనసాగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్ల కంటే బంగారాన్నే సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. దీనివల్ల గ్లోబల్ డిమాండ్ పెరిగి స్వర్ణం ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.