రాజకీయం

కంటోన్మెంట్..జూబ్లీహిల్స్‌..ఇప్పుడు ఖైరతాబాద్‌! నగరంలో బైపోల్ హీట్

Agasthya kantu

2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు ఉప ఎన్నికలు జరిగాయి. అవి సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతుందనే చర్చ జరుగుతోంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండున్నరేళ్లలో వచ్చిన సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఇప్పుడు వస్తుందని భావిస్తున్న ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా హైదరాబాద్ నగర పరిధిలోనిదే కావడం విశేషం. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కావడం మరో విశేషం. సిట్టింగ్ ఎమ్మెల్యేల అకాల మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్  ఉప ఎన్నికలు వస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది.

2023 అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్ నగర (పాత జీహెచ్ఎంసీ) పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ కనీసం ఖాతా తెరవలేకపోయింది. మొత్తం 24 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సీటూ కూడా గెలుచుకోలేక పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ రెండూ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తద్వారా 2023లో హైదరాబాద్‌ నగర పరిధిలో ఎమ్మెల్యే ప్రాతినిధ్యం లేకుండా ఉన్న కాంగ్రెస్‌కు, ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు చేరినట్లయింది.

కంటోన్మెంట్‌లో సీన్‌ రివర్స్‌.. ఓడిన బీజేపీ అభ్యర్థే కాంగ్రెస్‌ తరఫున గెలిచారు!

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ (SC రిజర్వ్‌డ్) నియోజకవర్గం నుంచి  ఎమ్మెల్యేగా జి. లాస్య నందిత (బీఆర్ఎస్) విజయం సాధించారు. అయితే దురదృష్టవశాత్తూ 2024 ఫిబ్రవరి 23న ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

2024, మే 13న జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో శ్రీగణేష్ (కాంగ్రెస్),  జి. నివేదిత (బీఆర్ఎస్, లాస్య సోదరి), టి.ఎన్. వంశ తిలక్ (బీజేపీ) పోటీ చేశారు. ఇందులో శ్రీగణేష్ (కాంగ్రెస్) 53,651 ఓట్లు,  వంశ తిలక్ (బీజేపీ) 40,445 ఓట్లు,  నివేదిత (బీఆర్ఎస్) 34,462 ఓట్లు సాధించారు.  కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ 13,206 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2023లో లాస్య నందిత చేతిలో ఓడిన శ్రీ గణేశ్ అప్పట్లో బీజేపీ అభ్యర్థి. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2024 ఉప ఎన్నికలో  విజయం సాధించారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లాస్య నందిత 59,057 ఓట్లు వచ్చాయి. (47.52 శాతం). అదే 2024 ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన నివేదితకు 34,462 ఓట్లు (26.25 శాతం)  మాత్రమే వచ్చాయి. అంటే 2023తో పోలిస్తే బీఆర్‌ఎస్‌ ఓట్లు 24,595 తగ్గాయి, ఓట్ల శాతం కూడా 21.27 శాతానికి పడిపోయింది.

2023లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెన్నెల గద్దర్‌కు 20,825 ఓట్లు (16.72 శాతం) ఓట్లు వచ్చాయి. 2024 ఉప ఎన్నికలో  కాంగ్రెస్‌ అభ్యర్ధి శ్రీగణేష్‌  53,651 ఓట్లు (40.86 శాతం) ఓట్లు సాధించారు. అంటే 2023తో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీకి 32,826 ఓట్లు పెరిగాయి (24.14 శాతం) .

2023లో బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్‌ 41,888 ఓట్లు  (33.64 శాతం) సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2024 ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసిన టి.ఎన్. వంశతిలక్‌ కు 40,445 ఓట్లు (30.80 శాతం) వచ్చాయి. అంటే 1,443 ఓట్లు తగ్గాయి.

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పాగా 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ 80,549 ఓట్లు (43.94 శాతం) సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ అజారుద్దీన్‌ 64,212 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 16,247 ఓట్ల మెజార్టీతో గోపీనాథ్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 25,866 ఓట్లు వచ్చాయి.  అయితే 2025 జూన్‌ 8న సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మరణించడంతో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు 2025, నవంబర్‌ 11న ఉప ఎన్నిక జరిగింది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మాత్రం 2023 అసెంబ్లీ ఫలితాలకు భిన్నమైన ఓటింగ్‌ కనిపించింది. సికింద్రాబాద్‌ లోక్‌సభకు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన దానం నాగేందర్‌కు జూబ్లీహిల్స్‌లో 89,705 ఓట్లు (50.83 శాతం) వచ్చాయి. బీజేపీ అభ్యర్థి జి. కిషన్‌రెడ్డికి 64,673 ఓట్లు (36.64 శాతం) రాగా, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి టి. పద్మారావుకు వచ్చిన ఓట్లు 18,405కు పడిపోయాయి. అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 80,549 ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్‌.. 2024 లోక్‌సభలో ఈ సెగ్మెంట్‌లో 18,405 ఓట్లకు పరిమితమైంది.

కాంగ్రెస్‌..64 వేల నుంచి 89 వేల ఓట్లకు

కాంగ్రెస్‌ పరంగా చూస్తే 2023లో మహ్మద్‌ అజారుద్దీన్‌కు వచ్చిన 64,212 ఓట్ల నుంచి, 2024 లోక్‌సభలో దానం నాగేందర్‌కు 89,705 ఓట్లకు పెరిగాయి. అంటే 25,493 ఓట్లు పెరిగాయి. ఓట్ల శాతం కూడా 35.03 నుంచి 50.83కి పెరిగింది.

బీజేపీ 25 వేల నుంచి 64 వేల ఓట్లకు

బీజేపీకి 2023లో జూబ్లీహిల్స్‌లో 25,866 ఓట్లు (14.11 శాతం) వచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్‌లో కిషన్‌రెడ్డికి 64,673 ఓట్లు (36.64 శాతం) వచ్చాయి. అంటే 38,807 ఓట్ల (పెరుగుదల శాతం 22.53)  పెరుగుదల నమోదైంది.

బీఆర్‌ఎస్‌ 80 వేల నుంచి 18 వేలకే

అత్యంత పెద్ద మార్పు బీఆర్‌ఎస్‌ విషయంలో కనిపించింది. 2023లో గోపీనాథ్‌కు 80,549 ఓట్లు (43.94 శాతం) రాగా, 2024 లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావుకు జూబ్లీహిల్స్‌ సెగ్మెంట్‌లో 18,405 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 2023తో పోలిస్తే 62,144 ఓట్లు తగ్గాయి. ఓట్ల శాతంలోనూ 43.94 నుంచి సుమారు 10.43 శాతానికి భారీగా పడిపోయింది.

2025 ఉప ఎన్నికలో మళ్లీ మరో మలుపు

2025 ఉప ఎన్నికలో 2024 లోక్‌సభ ఫలితాల కంటే మళ్లీ భిన్నమైన తీర్పు వచ్చింది. కాంగ్రెస్‌ అభ్యర్థి వి. నవీన్‌ యాదవ్‌ 98,988 ఓట్లు (50.83 శాతం) సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత 74,259 ఓట్లతో (38.13 శాతం) రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061 ఓట్లు (8.76 శాతం) వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌ 24,729 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌కు 89,705 ఓట్లు వచ్చాయి. 2025 ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి వి. నవీన్‌ యాదవ్‌కు 98,988 ఓట్లు వచ్చాయి. అంటే ఏడాది వ్యవధిలో కాంగ్రెస్‌ ఓట్లు 9,283 పెరిగాయి.

బీఆర్‌ఎస్‌కు మాత్రం 2024 నుంచి 2025 మధ్య గణనీయమైన మార్పు కనిపించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ సెగ్మెంట్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి టి. పద్మారావుకు కేవలం 18,405 ఓట్లు వచ్చాయి. 2025 ఉప ఎన్నికలో మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. అంటే 55,854 ఓట్లు పెరిగాయి. ఓట్ల శాతం కూడా 2024లో సుమారు 10.43 శాతం నుంచి 2025లో 38.13 శాతానికి పెరిగింది.

బీజేపీకి 2024 లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో 64,673 ఓట్లు వచ్చాయి. అయితే 2025 ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 47,612 ఓట్లు తగ్గాయి. ఓట్ల శాతం కూడా సుమారు 36.64 శాతం నుంచి 8.76 శాతానికి పడిపోయింది.

మరణంతో రెండుసార్లు.. ఇప్పుడు అనర్హతతో? ఖైరతాబాద్‌లో మరోసారి ఉప ఎన్నిక?

2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత  సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. దానికి భిన్నంగా పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో అనర్హత వేటు వేయడంతో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి రాజకీయంగా, భౌగోళికంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఖైరతాబాద్ ప్రాంతంలో నిర్వహించే గణేష్ ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లోనే విశేష ప్రాచుర్యం పొందాయి.  నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఖైరతాబాద్ గుర్తింపు పొందింది. 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖైరతాబాద్‌లో 7,51,715 మంది ఓటర్లు ఉన్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్ నుంచి శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఆవిర్భవించాయి.

1967లో ఖైరతాబాద్ నియోజవర్గం ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1970, 2008లలో రెండు సార్లు మాత్రమే ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ రెండు సందర్భాలలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఎమ్మెల్యే మీద అనర్హత వేటుతో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది.

1970 ఉప ఎన్నిక.. తెలంగాణ ఉద్యమ ప్రభావం

1967లో ఖైరతాబాద్ నియోజవర్గం ఏర్పడిన తర్వాత తొలి ఉప ఎన్నిక 1970లో జరిగింది. అప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బి.వి. గురుమూర్తి మరణంతో ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికలో తెలంగాణ ప్రజా సమితి (TPS) తరఫున నాగం కృష్ణారావు, కాంగ్రెస్‌ తరఫున ఎస్. యాదగిరి పోటీ చేశారు. 1970 జూన్‌ 15న వెలువడిన ఫలితాల్లో నాగం కృష్ణారావు 14 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తద్వారా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్).. అధికారికంగా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారకముందే ఎన్నికల రాజకీయాల్లో తన ప్రభావాన్ని చాటుకుంది.

పీజేఆర్ మరణంతో..2008 ఉప ఎన్నిక

2004లో ఖైరతాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన పి. జనార్దన్‌రెడ్డి 2007 డిసెంబర్‌ 28న మరణించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2008 మే 29న పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన విష్ణువర్ధన్‌రెడ్డి 2.54 లక్షలకుపైగా ఓట్లు సాధించి, సమీప ప్రత్యర్థి శ్రీనివాసరావు (లోక్‌సత్తా)పై ఏకంగా 1.96 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖాజా అరిఫుద్దీన్‌ 54,134 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.

పీజేఆర్ మీద గౌరవంతో ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్ధిని నిలబెట్టలేదు. కానీ టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్) మాత్రం అభ్యర్ధిని నిలబెట్టింది. ఏకగ్రీవం కోసం సహకరించాలని పీజేఆర్ కుమారుడు విష్ణు వెళితే గంట సేపు వెయిట్ చేయించి కలవకుండా (కేసీఆర్) పంపించారు. ఇప్పుడు విష్ణు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.