మధుయాష్కీ గౌడ్, కోదండరెడ్డి 
రాజకీయం

దేశ ఐక్యత కోసం ఇందిర, పటేల్‌ చేసిన సేవలు మరువలేనివి: మధుయాష్కీ

ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో మధుయాష్కీ గౌడ్ నివాళులర్పించారు.

Phaneendra

ప్రభాత ఉదయం, నాంపల్లి : దేశ నిర్మాణం, ఐక్యత, సమగ్రత కోసం జీవితాలను అంకితం చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన రోజు ఇదని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శనివారం గాంధీభవన్‌లో వారి చిత్రపటాలకు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలిసి నివాళులర్పించారు.

హైదరాబాద్ విలీనంలో పటేల్ పాత్ర కీలకం

ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం దేశ నిర్మాణంలో తొలి ప్రధాని నెహ్రూతో కలిసి పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. చిన్నచిన్న సంస్థానాలు, రాజ్యాలను భారతదేశంలో విలీనం చేసి దేశాన్ని ఐక్యం చేసిన మహనీయుడని కొనియాడారు. ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడంలో పటేల్ కృషి మరువలేనిదన్నారు.

పేదల అభ్యున్నతికి ఇందిరమ్మ కృషి

దేశ నిర్మాణంలో ఇందిరాగాంధీ పాత్ర ఎంతో గొప్పదని మధుయాష్కీ పేర్కొన్నారు. 'గరీబీ హటావో' నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేశారని, బ్యాంకుల జాతీయీకరణ ద్వారా పేదలకు ఆర్థిక అవకాశాలు కల్పించారని కొనియాడారు. హరిత విప్లవానికి ప్రోత్సాహమిచ్చి దేశ ఆహార భద్రతకు బాటలు వేశారన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడిన ఇందిరాగాంధీ చరిత్రలో మహానేతగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

ఇందిరమ్మ బాటలో ప్రజా ప్రభుత్వం

తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని మధుయాష్కీ అన్నారు. పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించి, దేశ నిర్మాణానికి జీవితాలను అంకితం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. అయితే, మహానేతలను స్మరించుకోవడంలోనూ బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు.