కాంగ్రెస్‌లో సస్పెన్షన్ వివాదంపై మంత్రి శ్రీధర్ బాబుకు లేఖ రాసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ 
రాజకీయం

మంథని ‘హస్తం’లో మంటలు

మంథని నియోజకవర్గంలో ఇద్దరు కాంగ్రెస్ నేతల సస్పెన్షన్‌పై ఎంపీ గడ్డం వంశీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

Phaneendra

పెద్దపల్లి పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలో హస్తం గూటిలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి దుద్దిళ్ల ప్రాతినిథ్యం వహిస్తున్న మంథని నియోజకర్గ పరిధిలో ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్​, వార్డు సభ్యురాలిపై సస్పెన్షన్​ వేటు వేయడం రాజకీయ దుమారం రేపింది.  

ప్రభాత ఉదయం, కరీంనగర్: మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబాల మధ్య వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇటీవల మంథని నియోజకవర్గం మలహర్ మండలం కొయ్యూరులో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి పాల్గొన్న వార్డు సభ్యురాలు లకావత్ లక్ష్మి, ఉపసర్పంచ్ లకావత్ సవేందర్‌ను కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ పార్టీ నుంచి సస్పెండ్​ చేశారు. ఈ  విషయాన్ని ఎంపీ బహిరంగంగానే వ్యతిరేకించారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు లేఖ రాశారు. ఈ విషయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. లకావత్ లక్ష్మి కుటుంబం 20 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తోందని, ఆమె భర్త తిరుపతి నాయక్ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని లేఖలో ప్రస్తావించారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం శ్రమించిన గిరిజన కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి, సస్పెండ్​ చేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. ఒక ఎంపీని కలవడం, పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసే సేవా కార్యక్రమంలో పాల్గొనడం పార్టీ వ్యతిరేక చర్య ఎలా అవుతుందని ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నించారు. ముందస్తు షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా, వివరణ కోరకుండా సస్పెన్షన్ విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి టికెట్

2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాకా వెంకటస్వామి వారసుడిగా వివేక్​ వెంకటస్వామి రాజకీయ అరంగేట్రం చేసి పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్​లో గళమెత్తారు. సీడబ్ల్యూసీ తెలంగాణ ఇచ్చేందుకు ఆమోదం తెలిపాక అనూహ్యంగా కాంగ్రెస్​ను వీడి ‘కారె’క్కారు. అప్పటికే మంథని నుంచి ప్రాతినిథ్యం  వహిస్తున్న శ్రీధర్ బాబు మంత్రిగా కొనసాగుతున్నారు. వివేక్ ఎంపీగా కొనసాగుతున్న పెద్దపల్లి పార్లమెంట్​ పరిధిలోనే మంత్రి నియోజకవర్గం ఉండటంతో కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో ఇరువురి మధ్య సఖ్యత కొరవడింది. ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటైన తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నాటికి వివేక్ మళ్లీ హస్తం గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తిరిగి గులాబీ గూటికి చేరారు. దీంతో అప్పటి సీఎం కేసీఆర్​ ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాల్క సుమన్ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్ తనకే వస్తుందని భావించిన వివేక్​కు చుక్కెదురైంది.  అనూహ్యంగా బీఆర్ఎస్ బోర్లకుంట వెంకటేశ్​ నేతకు టికెట్​ ఇచ్చింది. దీంతో అసంతృప్తికి గురైన వివేక్ ‘కాషాయ’ కండువా కప్పుకొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి తిరిగి వివేక్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ ఎన్నికల్లో చెన్నూరు నుంచి వివేక్, బెల్లంపల్లి నుంచి ఆయన సోదరుడు వినోద్ కుమార్,  2024 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కుమారుడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి గెలుపొందారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి టికెట్ ఇవ్వడంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నియోజకవర్గం పరిధిలోని మంత్రి శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తదితరులు వంశీకృష్ణకు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వివాదాన్ని పరిష్కరించాలని సీఎం రేవంత్​రెడ్డి శ్రీధర్​బాబుకు సూచించడంతో వంశీకృష్ణ గెలుపు కోసం కలిసినడిచారు. అనంతరం వివేక్​కు మంత్రి పదవి సైతం కట్టబెట్టడం విమర్శలకు దారి తీసింది.

ఎంపీగా గెలిచిన నాటి నుంచి సమన్వయం కరువు

పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపొందిన నాటి నుంచి నియోజకవర్గంలోని మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ విజయ రమణారావు, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్​తో సఖ్యత కరువయింది. కేవలం వివేక్ వర్గీయులతో మాత్రమే సంబంధాలు నెరపిన ఎంపీ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలకే పరిమితమయ్యారనే చర్చలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షతో ప్రొటోకాల్ విభేదాలు సైతం రచ్చకెక్కాయి. కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎంపీ ఫోటోలు చిన్నగా పెట్టారంటూ వివాదం చెలరేగింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో వేదిక పంచుకోకపోవడం ఆయన వైఖరిని స్పష్టం చేస్తోంది. ఎంపీగా గెలుపొందిన తరవాత నిర్వహించిన దిశ మీటింగ్ మరల నిర్వహించకపోవడం గమనార్హం. అయితే రామగుండంలో ఈఎస్ఐ ఆస్పత్రికి ప్రభుత్వ స్థలం కేటాయింపులో అధికార యంత్రాంగం సరిగా స్పందించకపోవడంతో అధికారులపై ఎంపీ కినుక వహించారు. ఇటీవల భూ కేటాయింపు విషయమై కలెక్టర్​కు లేఖ రాశారు. మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలోని రామగిరి ఖిల్లాపై రోప్ వే నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించారు. రామగిరి ఖిల్లాను సందర్శించి ట్రెక్కింగ్ నిర్వహించారు. తాజాగా ఉప సర్పంచ్, వార్డు మెంబర్​లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సంచలనం రేపింది. ఇందుకు మంత్రి శ్రీధర్ బాబే కారణం అని భావిస్తున్న ఎంపీ వంశీకృష్ణ మంత్రికి లేఖ రాయడం, ఆ లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎటు వైపు దారి తీస్తుందోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.