ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ఢిల్లీ రాంలీలా మైదానంలో నవంబర్ 1న నిర్వహించ తలపెట్టిన ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ ర్యాలీకి తెలంగాణ నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం పలు నియోజకవర్గాల నుంచి బస్సులు బయలు దేరాయి. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్రలోని నాగపూర్ వైపు వెళ్లనున్నాయి. రాంలీలా మార్చ్‌కు రాష్ట్రం నుంచి 10 వేల మంది కార్యకర్తలను తరలించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. ఇందుకోసం రెండు ప్రత్యేక రైళ్లను కేటాయించాలని 10 రోజుల కింద రైల్వే జీఎంకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ లేఖ పంపించారు. వెంటనే నిర్ణయం తీసుకోకుండా, రైళ్లు సమకూర్చలేమని ఆలస్యంగా చెప్పడంతో రచ్చ జరిగింది. రైల్వే అధికారుల తీరుకు నిరసనగా సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు. అనంతరం మహేశ్ కుమార్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, నియోజకవర్గాల వారీగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కార్యకర్తలను ఢిల్లీకి తరలించాలని సూచించారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. పీసీసీ చీఫ్ సూచన మేరకు పలు నియోజకవర్గాల నుంచి ప్రత్యేక బస్సుల్లో పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. ఒక్కో బస్సులో 40 మంది చొప్పున 70 బస్సుల్లో 3 వేల మంది వరకు తరలి వెళ్లారు. రైలు, ఇతర మార్గాల ద్వారా మరో 2 వేల మంది వెళ్లే అవకాశం ఉంది. ఇక మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వంద కార్లతో తన నియోజకవర్గం నుంచి బయలుదేరారు. ఢిల్లీ సమీపంలోని చెక్ పోస్టుల వద్ద పోలీసులు ఆంక్షల పేరుతో నిలిపి వేసే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితి ఎదురైతే రాష్ట్ర నాయకత్వానికి తెలియచేయాలని కార్యకర్తలకు మహేశ్ కుమార్ సూచించారు. ఎలాంటి అడ్డంకులు సృష్టించినా, వాటిని దాటుకొని రాంలీలా మైదానం చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని కోరారు.
చంద్రబాబును ప్రసన్నం చేసుకునే పనిలో బావ బామ్మర్దులు: పీసీసీ చీఫ్
బావ బామ్మర్దులు హరీశ్ రావు, కేటీఆర్ ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెగ పొగుడుతుండటంపై పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ ఆరాట పడుతోందని, అందుకు తగ్గట్లుగా చంద్రబాబును ప్రసన్నం చేసుకొనే పనిలో ఉందన్నారు. ‘బీజేపీ, టీడీపీతో మీ చీకటి ఒప్పందం అర్థం అవుతోంది. గతంలో మీరు ఏ నోటితో చంద్రబాబు నాయుడును అనరాని మాటలు అన్నారో గుర్తుందా?’ అని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో పొత్తులో భాగంగానే చంద్రబాబు ఆశీస్సుల కోసం బావ బామ్మర్దులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌పై అబద్ధాలతో యాగి చేసే బీఆర్ఎస్, తన సోషల్ మీడియాలో చంద్రబాబు, బీజేపీని ఏం అనకుండా ఉంటున్నప్పుడే వారి చీకటి ఒప్పందం అర్థం అయిందని తెలిపారు. దమ్ముంటే బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీకి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ సీటు వదులుకుంటున్నారా? అని నిలదీశారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ అభ్యర్థి గెలుపు కోసం బీజేపీ సాయం తీసుకుంటారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దొంగచాటు బంధాన్ని త్వరలో సాక్ష్యాలతో రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.