రాజకీయాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు కొత్త విషయం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం ఫిరాయింపుల పర్వం పరాకాష్ఠకు చేరింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. మధ్యలో కండువా మార్చిన దృశ్యాలు తెలంగాణ రాజకీయాల్లో 2014 తర్వాత ఎన్నో కనిపించాయి. 2023లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. ఫిరాయింపుల పరంపర మాత్రం ఆగలేదు. ఈ నేపథ్యంలో 2014 నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల రాజకీయ ప్రయాణం ఆ తర్వాతి ఎన్నికల్లో ఎలా సాగింది? అసలు ఎవరెవరు గెలిచారు? ఎవరెవరు ఓడిపోయారు? పార్టీ మారిన తర్వాత వారి ఓట్ల శాతం ఎలా మారింది? సంబంధిత అంశాలపై విశ్లేషణ..
2014లో మొదలైన పర్వం.. టీఆర్ఎస్ గూటికి 25 మంది
2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిరాయింపులు పెద్ద ఎత్తున సాగాయి. కాంగ్రెస్, బీఎస్పీ, టీడీపీ, సీపీఐల నుంచి దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ గూటికి చేరారు. వారు.. జి. విఠల్‌రెడ్డి (కాంగ్రెస్, ముధోల్), కోరం కనకయ్య (కాంగ్రెస్, ఇల్లెందు), కాలె యాదయ్య (కాంగ్రెస్, చేవెళ్ల), నల్లమోతు భాస్కరరావు (కాంగ్రెస్, మిర్యాలగూడ), చిట్టెం రామ్మెహన్ రెడ్డి (కాంగ్రెస్, మక్తల్), పువ్వాడ అజయ్ కుమార్ (కాంగ్రెస్, ఖమ్మం), రెడ్యా నాయక్ (కాంగ్రెస్, డోర్నకల్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీడీపీ, సనత్‌నగర్), చల్లా ధర్మారెడ్డి (టీడీపీ, పరకాల), తీగల కృష్ణారెడ్డి (టీడీపీ, మహేశ్వరం), మాధవరం కృష్ణారావు (టీడీపీ, కూకట్‌పల్లి), కేపీ వివేకానంద్ (టీడీపీ, కుత్బుల్లాపూర్), అరెకపూడి గాంధీ (టీడీపీ, శేరిలింగంపల్లి), ప్రకాశ్‌గౌడ్ (టీడీపీ, రాజేంద్రనగర్), మాగంటి గోపీనాథ్ (టీడీపీ, జూబ్లీహిల్స్), ఎర్రబెల్లి దయాకర్‌రావు (టీడీపీ, పాలకుర్తి), ఎస్. రాజేందర్‌రెడ్డి (టీడీపీ, నారాయణపేట), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (టీడీపీ, ఇబ్రహీంపట్నం), జి. సాయన్న (టీడీపీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్), మదన్‌లాల్ (వైఎస్సార్‌సీపీ, వైరా), పాయం వెంకటేశ్వర్లు (వైఎస్సార్‌సీపీ, పినపాక), తాటి వెంకటేశ్వర్లు (వైఎస్సార్‌సీపీ, అశ్వారావుపేట), అలోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి (బీఎస్పీ, నిర్మల్), కోనేరు కోనప్ప (బీఎస్పీ, సిర్పూర్), రామావత్ రవీంద్ర కుమార్ (సీపీఐ, దేవరకొండ). వీరిలో అలోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు మంత్రి పదవులు కూడా దక్కాయి.
ఎమ్మెల్యేలే కాదు.. ఎంపీలు కూడా
ఫిరాయింపులు కేవలం ఎమ్మెల్యేలకే పరిమితం కాలేదు.. ఎంపీలు కూడా పార్టీలు మారడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి నల్లగొండ ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరారు.
25 మందిలో 20 మంది మళ్లీ గెలిచారు
2014–18 మధ్య పార్టీ మారిన 25 మంది ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ 2018 ఎన్నికల్లో మళ్లీ టికెట్లు ఇచ్చింది. వారిలో 20 మంది తిరిగి విజయం సాధించగా.. ఐదుగురు ఓటమి పాలయ్యారు. తిరిగి గెలిచిన వారిలో జి. విఠల్‌రెడ్డి (ముధోల్), కాలె యాదయ్య (చేవెళ్ల), రెడ్యా నాయక్ (డోర్నకల్), నల్లమోతు భాస్కరరావు (మిర్యాలగూడ), చిట్టెం రామ్మెహన్ రెడ్డి (మక్తల్), పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం), తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్‌నగర్), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), కేపీ వివేకానంద్ (కుత్బుల్లాపూర్), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), చల్లా ధర్మారెడ్డి (పరకాల), మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), ఎస్. రాజేందర్‌రెడ్డి (నారాయణపేట), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), జి. సాయన్న (సికింద్రాబాద్ కంటోన్మెంట్), అలోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), కోనేరు కోనప్ప (సిర్పూర్), రామావత్ రవీంద్ర కుమార్ (దేవరకొండ) ఉన్నారు.
ఓడిపోయిన వారు..మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి.. సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్) చేతిలో, ఇల్లెందులో కోరం కనకయ్య.. హరిప్రియ బానోత్ (కాంగ్రెస్) చేతిలో, వైరాలో మదన్‌లాల్.. లావుడ్యా రాములు (స్వతంత్ర) చేతిలో, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు.. రేగా కాంతారావు (కాంగ్రెస్) చేతిలో, అశ్వారావుపేటలో తాటి వెంకటేశ్వర్లు.. మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ) చేతిలో ఓడిపోయారు.
ఎంపీల్లో ఒకరికి టికెట్ నో.. మరొకరికి మండలి పీఠం
ఎంపీల విషయానికొస్తే 2019 లోకసభ ఎన్నికల్లో ఖమ్మం లోకసభ స్థానం నుంచి శ్రీనివాస్ రెడ్డికి తిరిగి అవకాశం దక్కలేదు. ఆయన స్థానంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖమ్మం అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన నామా నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. ఆయన విజయం సాధించారు. మంత్రి పదవి మీద ఉన్న ఆసక్తితో గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదు. 2019లో ఎమ్మెల్యేల కోటాలో తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి.. అదే ఏడాది సెప్టెంబర్ 11న తొలిసారి శాసనమండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2021లో నవంబర్‌లో ఎమ్మెల్యేల కోటాలో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై.. 2022 మార్చి 14న రెండోసారి మండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
88 సీట్లు వచ్చినా.. ఫిరాయింపులకు బ్రేక్ పడలేదు!
2018లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలిచింది.. అంటే ప్రభుత్వాన్ని నడిపించడానికి కావాల్సిన బలం అప్పటికే చేతిలో ఉంది. అయినా.. ‘గెలిచిన సీట్లు చాలవా?’ అన్నట్టుగా.. తమ అభ్యర్థులను ఓడించిన ఐదుగురితో కలిపి మరో 16 మంది ఎమ్మెల్యేలనూ గులాబీ గూటికి చేర్చుకుని అందరని విస్మయానికి గురి చేసింది. ఆ విధంగా గులాబీ కండువా కప్పుకున్న వారిలో..కందాల ఉపేందర్‌రెడ్డి (కాంగ్రెస్, పాలేరు), జాజాల సురేందర్ (కాంగ్రెస్, ఎల్లారెడ్డి), హరిప్రియ బానోత్ (కాంగ్రెస్, ఇల్లెందు), దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (కాంగ్రెస్, ఎల్‌బీనగర్), గండ్ర వెంకట రమణారెడ్డి (కాంగ్రెస్, భూపాలపల్లి), చిరుమర్తి లింగయ్య (కాంగ్రెస్, నకిరేకల్), రేగా కాంతారావు (కాంగ్రెస్, పినపాక), సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్, మహేశ్వరం), ఆత్రం సక్కు (కాంగ్రెస్, ఆసిఫాబాద్), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కాంగ్రెస్, కొల్లాపూర్), వనమా వెంకటేశ్వరరావు (కాంగ్రెస్, కొత్తగూడెం), పైలట్ రోహిత్‌రెడ్డి (కాంగ్రెస్, తాండూరు), మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ, అశ్వారావుపేట), సండ్ర వెంకట వీరయ్య (టీడీపీ, సత్తుపల్లి) ఉన్నారు, కోరుకంటి చందర్ (ఏఐఎఫ్బీ, రామగుండం), లావుడ్యా రాములు (స్వతంత్ర, వైరా). వీరిలో సబితా ఇంద్రా రెడ్డికి మంత్రి పదవి దక్కింది.
కండువా మార్చిన.. గెలిచింది ఇద్దరే!
2018-2023 హయాంలో పార్టీ ఫిరాయించిన 16 మందిలో ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), లావుడ్యా రాములు (వైరా) మినహా మిగిలిన 14 మందికి బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చింది. వీరిలో ఇద్దరు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్‌బీనగర్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం) మాత్రమే విజయం సాధించారు. మిగిలిన 12 మంది ఓటమి పాలయ్యారు. ఫిరాయింపులకు ‘రివార్డు’గా టికెట్లు దక్కినా.. ఓటరు మాత్రం బ్యాలెట్ బాక్సులో తిరస్కరణ ముద్ర వేశారు. వారు..కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు) కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో, జాజాల సురేందర్ (ఎల్లారెడ్డి) కాంగ్రెస్ అభ్యర్థి కె. మదన్ మోహన్ రావు చేతిలో, హరిప్రియ బానోత్ (ఇల్లెందు) కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య చేతిలో, గండ్ర వెంకట రమణారెడ్డి (భూపాలపల్లి) కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు చేతిలో, చిరుమర్తి లింగయ్య (నకిరేకల్) కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం చేతిలో, రేగా కాంతారావు (పినపాక) కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు చేతిలో, బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్) కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు చేతిలో, వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం) సీపీఐ అభ్యర్థి (కాంగ్రెస్ మద్దతు) కూనంనేని సాంబశివరావు చేతిలో, పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు) కాంగ్రెస్ అభ్యర్థి బయ్యని మనోహర్ రెడ్డి చేతిలో, మెచ్చా నాగేశ్వరరావు (అశ్వారావుపేట) కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ చేతిలో, సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి) కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి చేతిలో ఓడిపోయారు. ఆసిఫాబాద్ నియోజవర్గంలో ఆత్రం సక్కు బదులు కోవా లక్ష్మీకి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది. వైరాలో రాములు బదులు బానోత్ మదన్‌లాల్ కు టికెట్ ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి మాలోత్ రాందాస్ చేతిలో మదన్‌లాల్ ఓడిపోయారు.
అధికారం మారిన.. ఫిరాయింపులు ఆగలేదు
2023లో బీఆర్ఎస్ ఓడింది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికార మారింది.. ప్రభుత్వం మారింది.. కానీ ఫిరాయింపుల రాజకీయ సంప్రదాయం మాత్రం మారలేదు! ఒక పార్టీపై గెలిచి.. అధికార పార్టీ వైపు అడుగులు వేసే అనవాయితీ కొనసాగుతూనే ఉంది. 2014 తర్వాత ఊపందుకున్న ఫిరాయింపుల పరంపర.. 2023 తర్వాత కూడా అదే బాటలో సాగింది. ఈ క్రమంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. వారు.. దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ, మాజీ స్పీకర్), ఎం. సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవెళ్ల), ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), అరేకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), బండ్ల కృష్ణామోహన్ రెడ్డి (గద్వాల్). వీరిపై వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. వీరిలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయడంతో హైకోర్టు అనర్హత వేటు వేసింది. మిగిలిన వారిలో గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు) తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. నాగేందర్ మినహా మిగిలిన ఎమ్మెల్యేల అనర్హత మీద కోర్టులో కేసులు నడుస్తున్నాయి.
ఫిరాయింపుదారుల్లో 75 శాతం మళ్లీ గెలుపు
2014లో పార్టీలు మారిన 25 మంది ఎమ్మెల్యేలకూ టీఆర్ఎస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టికెట్లు ఇచ్చింది. వారిలో 20 మంది తిరిగి విజయం సాధించగా.. ఐదుగురు ఓటమి పాలయ్యారు. అంటే ఫిరాయింపుదారుల్లో 80 శాతం మంది తర్వాతి ఎన్నికల్లోనూ గెలిచారు. మరో 20 శాతం మంది ఓటమి చవిచూశారు. సూటిగా చెప్పాలంటే.. 2014లో పార్టీ మారిన ప్రతి నలుగురిలో ముగ్గురు (3.2) 2018లో మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఫిరాయింపుదారులకు చెక్
2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌లోకి వెళ్లిన 16 మంది ఎమ్మెల్యేల్లో 14 మందికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మళ్లీ టికెట్లు ఇచ్చింది. అయితే ఈసారి ఫలితం పూర్తిగా భిన్నంగా వచ్చింది. టికెట్ పొందిన 14 మందిలో కేవలం ఇద్దరే విజయం సాధించగా.. 12 మంది ఓటమి పాలయ్యారు. దీంతో ఫిరాయింపుదారుల విజయ శాతం 14.28 శాతానికి పరిమితమైంది. ఓటమి శాతం ఏకంగా 85.71 శాతంగా నమోదైంది. అంటే 2014–18 మధ్య 80 శాతంగా ఉన్న విజయ శాతం.. 2018-23 మధ్య కేవలం 14.28 శాతానికి పడిపోయింది.
ఇద్దరిలో ఒకరికి మాత్రమే ప్రజా మద్దతు
2014, 2018 మధ్య కాలంలో తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకున్న ఫిరాయింపులను సమగ్రంగా పరిశీలిస్తే ఆసక్తికరమైన గణాంకాలు వెల్లడవుతాయి. 2014లో పార్టీ మారిన 25 మంది, 2018 తర్వాత వచ్చిన 16 మందితో కలిపి మొత్తం 41 మంది ఎమ్మెల్యేలు అధికార బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) లో చేరారు. వీరిలో ఏకంగా 39 మందికి (95.12 శాతం) పార్టీ మళ్లీ తర్వాతి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి పోటీ చేసే అవకాశం కల్పించగా, కేవలం ఇద్దరికి మాత్రమే టికెట్ దక్కలేదు. అయితే, ఈ 39 మంది పోటీదారులలో.. 22 మంది (56.41 శాతం) విజయం సాధించగా, 17 మంది (43.59 శాతం) ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో ఫిరాయింపుదారులు 80 శాతం భారీ విజయ శాతాన్ని నమోదు చేయగా, 2023 ఎన్నికల నాటికి అది తీవ్రంగా దిగజారి కేవలం 14.28 శాతానికి పడిపోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. తెలంగాణలో పార్టీ మారిన ప్రతి ఇద్దరిలో ఒకరికి మాత్రమే (53.65 శాతం) తర్వాతి ఎన్నికల్లో గెలుపు దక్కింది.
కండువా మార్చడం.. మళ్లీ.. మళ్లీ!
కాలె యాదయ్య 2014లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. 2018లో గెలిచారు. 2023లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో..తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు.
ప్రకాష్ గౌడ్ కూడా 2014లో టీడీపీ టికెట్ మీద గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. 2018లో గెలిచారు. 2023లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో..కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు.
2014లో అరేకపూడి గాంధీ టీడీపీ టికెట్ మీద గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. 2018లో గెలిచారు. 2023లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో..కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు.
నాడు ఓటమి.. నేడు ఫిరాయింపుదారులపై గెలుపు!
కోరం కనకయ్య (ఇల్లెందు): 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియ చేతిలో ఓడిపోయారు. 2023లో హరిప్రియ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే, కనకయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆమెను ఓడించారు.
పాయం వెంకటేశ్వర్లు (పినపాక): 2014లో YSRCP నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు చేతిలో ఓడిపోయారు. 2023లో రేగా కాంతారావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా, పాయం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి రేగాను ఓడించారు.